Babar Azam Becomes Fastest Batsman To Score 14 ODI Centuries; Surpasses Kohli And Hashim Amla- Sakshi
Sakshi News home page

వార్నర్‌, కోహ్లీలను వెనక్కు నెట్టిన పాక్‌ కెప్టెన్‌.. 

Published Wed, Jul 14 2021 3:04 PM | Last Updated on Wed, Jul 14 2021 8:18 PM

Babar Azam Becomes Fastest Batsman To Score 14 ODI Centuries, Surpassing Hashim Amla, Warner And Virat Kohli - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్, ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మంగళవారం అర్థరాత్రి వరకు జరిగిన మూడో వన్డేలో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 158; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కి కెరీర్‌లో 14వ శతకాన్ని నమోదు చేశాడు. బాబర్ ఈ ఘనతను కేవలం 81 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.

దీంతో ఈ జాబితాలోని దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా(84 ఇన్నింగ్స్‌లు), ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్(98 ఇన్నింగ్స్‌లు), టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (103 ఇన్నింగ్స్‌లు)‌లను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల క్రికెట్‌లోనూ ఏ బ్యాటర్‌ కూడా బాబర్‌ సాధించినంత తొందరగా 14 సెంచరీలు సాధించలేదు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లాన్నింగ్ 14 సెంచరీలు సాధించడానికి 82 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే, బాబర్ శతకంతో చెలరేగిన పాక్‌కు మాత్రం పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 102; 11 ఫోర్లు) సూపర్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ క్వీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పార్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఛేదనలో జేమ్స్ విన్స్(102), లూయిస్‌ గ్రెగరి(77) రాణించడంతో ఇంగ్లండ్‌ జట్టు మరో రెండు ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement