పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అసలు అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. గత ప్రపంచకప్ టోర్నీ(2022)లో రన్నరప్‌గా నిలిచిన బాబర్ బృందం.. ఈసారి చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్‌గా తొలగించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
టాపార్డర్‌లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి
బాబర్ ఆజం టీ20 ఫార్మాట్‌కు తగడని.. అతడికి జట్టులో చోటే అనవసరం అని పేర్కొన్నాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్‌లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి. బాబర్ ఆజం అలాంటి ప్లేయర్ కాదు.
కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లోనే అతడు హిట్టింగ్ ఆడగలడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో అతడు ఇలాంటి సాహసం చేయడం నేనెప్పుడూ చూడలేదు.
అతడు ఆచితూచి నెమ్మదిగా ఆడటమే మనకు కనబడుతుంది. బాబర్ పరుగులు సాధిస్తున్న మాట నిజమే. కానీ అతడి స్ట్రైక్‌రేటును కూడా గమనించాలి కదా!
అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు
నాయకుడిగా ఉన్నపుడు మన ఆట వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందా లేదో చూసుకోవాలి. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్‌లో డిమోట్ అయి.. తన స్థానాన్ని హిట్టింగ్ ఆడగల ప్లేయర్ల కోసం త్యాగం చేయగలగాలి.
ఒకవేళ అతడు గనుక కెప్టెన్ కాకపోయి ఉంటే.. అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు..
కానీ ఇదే నిజం. ఎందుకంటే నేటి టీ20 క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు అతడి ఆట లేనేలేదు’’ అని సెహ్వాగ్ నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి బాబర్ ఆజం 122 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్‌రేటు మాత్రం కేవలం 101.66 కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, కెనడా, ఐర్లాండ్ ఇంటిబాట పట్టాయి.
చదవండి: T20 WC: కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
Comments
Please login to add a commentAdd a comment