
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో కూడా అదే ఫలితం పునరావృతమైంది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటకట్టుకుంది.
దీంతో పాక్ జట్టు ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ చేరాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైన పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam)పై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆట తీరును అక్తర్ తప్పుబట్టాడు.
"మనం ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తాం. విరాట్‌కు బాబర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుని తన కెరీర్‌ను ప్రారంభించాడు. టెండ్కూలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.
సచిన్ సెంచరీలకు చేరువతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచిన విధానం సరిగ్గాలేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథమ్‌ను కోల్పోయాడు. బాబర్ ఆజం ఒక మోసగాడు. అతడు కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆసక్తి లేదు" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ..
కాగా ఈ మ్యాచ్‌లో 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఆజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.
చదవండి: పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!