పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ బౌలర్ సికందర్ బఖ్త్ ఘాటు విమర్శలు చేశాడు. ఇప్పటికైనా బాబర్‌కు సిగ్గు వచ్చిందని.. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైనపుడే ఈ పని చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.
వరుస వైఫల్యాలు
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ జట్టు పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్ చేతిలో తొలిసారి వన్డే పరాజయం చవిచూసిన బాబర్ బృందం.. సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా బాబర్ ఆజం టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.
తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా
ఈ క్రమంలో టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను నాయకుడిగా ఎంపిక చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. టీ20 పగ్గాలను ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. అయితే, వీరిద్దరు ఆరంభం నుంచే కెప్టెన్లుగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు షాహిన్‌పై వేటు వేసిన పీసీబీ.. బాబర్ ఆజంను తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది.
తాజాగా మరోసారి రాజీనామా
అయితే, అమెరికా- వెస్టిండీస్‌లో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓడటమే గాక.. కనీసం సూపర్-8 దశకు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టింది. జూన్‌లో ఈ టోర్నీ ముగిసిన నాటి నుంచి బాబర్ ఆజం.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడు బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది
బ్యాటింగ్‌పై దృష్టి పెట్టే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు బాబర్ ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సికందర్ బఖ్త్.. ‘‘ఇప్పటికైనా అతడికి సిగ్గు వచ్చింది. నిజానికి వరల్డ్‌కప్‌లో మా జట్టు ఓడిన నాడు.. అంటే జూన్ 16నే అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.
బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది
అప్పుడే కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సింది. దేశం మొత్తం ఇదే కోరుకుంది. కానీ అతడు మొండిగా ప్రవర్తించాడు. తను తాను ఓ కింగ్‌లా ఊహించుకోవడం బాబర్‌కు అలవాటు. తన ఆట తీరు బాగా లేకున్నా.. బాగుందనే ఫీలవుతాడు. అయితే, బోర్డు అతడిని రిజైన్ చేయమని చెప్పింది. అందుకే ఇప్పటికైనా కెప్టెన్సీని వదులుకున్నట్లు ప్రకటించాడు’’ అని పేర్కొన్నాడు.
ఇంటా, బయటా వరుస ఓటములు.. అయినా
కాగా టెస్టులకు షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించడంపై కూడా సికందర్ బఖ్త్ విమర్శలు చేశాడు. ఇంటా, బయటా వరుస టెస్టు సిరీస్‌లలో ఓటములనే బహుమతిగా ఇస్తున్న ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం దురదృష్టకరమంటూ పెదవి విరిచాడు. కాగా పాకిస్తాన్ తరఫున 1976- 1989 వరకు సికందర్ బఖ్త్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 26 టెస్టుల్లో 67, వన్డేల్లో 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.
చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్
Comments
Please login to add a commentAdd a comment