వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా జాసెన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.
బాబర్ ఆజంపై వేటు?
ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్ ఆఫ్రిదిని నియమించింది.
ఈసారి కూడా చేదు అనుభవమే
అయితే, షాహిన్ కెప్టెన్‌గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే బాబర్ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.
గత టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన బాబర్ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్ దశ దాటకుండానే పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆటగాళ్ల ఫిట్‌నెస్, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, ఛీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్‌లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
కిర్‌స్టన్ నిర్ణయం మేరకే
అదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విషయంలో కిర్‌స్టన్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది.
మరోవైపు.. దేశవాళీ క్రికెట్ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్‌మ్యాప్ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం.
పీసీబీ చైర్మన్‌ను కలిసి
ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్‌ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్ వెల్లడించింది.
కాగా పాకిస్తాన్ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.
చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment