సొంతగడ్డపై ఇటీవలే ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు షాకిచ్చి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా టైగర్స్.. తాజాగా ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే (2 మ్యాచ్‌ల తర్వాత) 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లాదేశ్.. ఇవాళ (మార్చి 23) జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.
ఈ మ్యాచ్‌లో బంగ్లా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 28.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (8.1-1-32-5), తస్కిన్ అహ్మద్ (10-1-26-3), ఎబాదత్ హొస్సేన్ (6-0-29-2) గోలాల్లాంటి బంతులు సంధించి ఐర్లాండ్‌ను మట్టికరిపించారు. వీరి దెబ్బకు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్లు కాగా.. కేవలం ఇద్దరు (టక్కర్ (28), కర్టిస్ క్యాంపర్ (36)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
యాదృచ్చికమైన విషయమేమిటంటే, వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లా పేసర్లు తొలిసారి 10కి 10 వికెట్లు పడగొట్టారు. బంగ్లా వన్డే హిస్టరీలో ఇలా ఎప్పుడు జరగలేదు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (19), లిటన్ దాస్ (8) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment