బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు వియాన్ ముల్డర్ (105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి.
తొలి రోజే ఓపెనర్ టోని డి జోర్జి, వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ శతకాలు బాదారు. ఓవర్‌నైట్ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెడింగ్‌హామ్ (59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్‌హామ్‌ను తైజుల్ బౌల్డ్ చేశాడు.
5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు
జోర్జి తన శతకాన్ని డబుల్ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.
తన మరుసటి ఓవర్లో కైల్ వెరియెన్ (0)ను తైజుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్‌లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్‌లో రికెల్టన్ (12) నహీద్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు.
రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.
దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్
ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
టాప్–3 బ్యాటర్లు షాద్‌మన్ (0), హసన్ (10), జాకీర్ హసన్ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడ 2 వికెట్లు తీయగా, నైట్‌వాచ్‌మన్ హసన్ (3)ను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. మోమినుల్ హక్ (6 బ్యాటింగ్), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
‘బాక్సింగ్ డే’ టెస్టులో
చివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్‌లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్ సెంచరీలు సాధించారు. 1948లో భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్ క్రిస్టియాని, క్లేడ్ వాల్కట్ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment