సీజన్‌లో నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లలో మూడో అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లి జోరు...తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లతో సత్తా చాటిన కొత్త పేస్ బౌలర్ విజయ్ కుమార్ వైశాక్...అండగా సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వెరసి చిన్నస్వామి మైదానంలో రాయల్ చాలెంజర్స్ విజయంతో మెరిసింది...
వరుసగా రెండు ఓటముల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది... మరో వైపు గెలుపు బోణీ చేసే దారి తెలియక గందరగోళంలో ఉన్న ఢిల్లీపై మరో దెబ్బ పడింది. ఎప్పటిలాగే పేలవ బ్యాటింగ్‌తో తిప్పలు పడుతున్న ఆ జట్టు మరో ఓటమిని ఆహ్వానించింది. 2 పరుగులకే తొలి 3 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్ ఆపై కోలుకోలేక సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంపాలైంది.
బెంగళూరు: గత మ్యాచ్‌లో అనూహ్యంగా చివరి బంతికి లక్నో చేతిలో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెంటనే కోలుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులే చేయగలిగింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. విజయ్ కుమార్ వైశాక్ (3/20) కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు.
శుభారంభం...
కోహ్లి, డుప్లెసిస్ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆర్‌సీబీకి శుభారంభం అందించారు. వీరిద్దరు 28 బంతుల్లో 42 పరుగులు జోడించిన అనంతరం కెపె్టన్ వెనుదిరిగాడు. 36 పరుగుల వద్ద కుల్దీప్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి ముస్తఫిజుర్ ఓవర్లో 4, 6తో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహిపాల్ లోమ్రోర్ (18 బంతుల్లో 26; 2 సిక్స్‌లు) కూడా ఆకట్టుకోగా, కోహ్లి అవుటయ్యాక వచి్చన మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 24; 3 సిక్స్‌లు) లలిత్ ఓవర్లో రెండు సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించాడు. ఒక దశలో ఆర్‌సీబీ స్కోరు 117/2. అయితే ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో 12 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది.
పాండే మినహా...
తొలి 3 ఓవర్లలోనే ఢిల్లీ రాత తేలిపోయింది. ఒక్కో ఓవర్‌లో ఒక్కో వికెట్ చొప్పున ఆ జట్టు కోల్పోయింది. పృథ్వీ షా (0) రనౌట్ కాగా, మార్ష్ (0), ధుల్ (1) వెంటవెంటనే అవుటయ్యాడు. సిరాజ్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కాస్త ధాటిని పెంచిన డేవిడ్ వార్నర్ (19) కూడా ఎక్కువ సేపు నిలబడలకేపోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 32/4కు చేరింది. ఆ తర్వాత మనీశ్ పాండే కాస్త ఆదుకునే ప్రయత్నం చేశాడు. హసరంగ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాది 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన పాండే అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే అవుట్‌తో ఢిల్లీ ఓటమి లాంఛనమే అయింది.
స్కోరు వివరాలు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ధుల్ (బి) లలిత్ 50; డుప్లెసిస్ (సి) అమాన్ (బి) మార్ష్ 22; లోమ్రోర్ (సి) పొరేల్ (బి) మార్ష్ 26; మ్యాక్స్‌వెల్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 24; హర్షల్ (సి) పొరేల్ (బి) అక్షర్ 6; షహబాజ్ (నాటౌట్) 20; కార్తీక్ (సి) లలిత్ (బి) కుల్దీప్ 0; రావత్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–42, 2–89, 3–117, 4–132, 5–132, 6–132.
బౌలింగ్: నోర్జే 4–0–31–0, అక్షర్ 3–0–25–1, ముస్తఫిజుర్ 3–0–41–0, మార్ష్ 2–0–18–2, లలిత్ 4–0–29–1, కుల్దీప్ 4–1–23–2.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) కోహ్లి (బి) వైశాక్ 19; పృథ్వీ షా (రనౌట్) 0; మార్ష్ (సి) కోహ్లి (బి) పార్నెల్ 0; ధుల్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; మనీశ్ పాండే (ఎల్బీ) (బి) హసరంగ 50; పొరేల్ (సి) పార్నెల్ (బి) హర్షల్ 5; అక్షర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 21; అమాన్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 18; లలిత్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వైశాక్ 4; నోర్జే (నాటౌట్) 23; కుల్దీప్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1–1, 2–1, 3–2, 4–30, 5–53, 6–80, 7–98, 8–110, 9–128.
బౌలింగ్: సిరాజ్ 4–0–23–2, పార్నెల్ 4–0–28–1, వైశాక్ 4–0–20–3, షహబాజ్ 1–0–11–0, హసరంగ 3–0–37–1, హర్షల్ 4–0–32–1.
Comments
Please login to add a commentAdd a comment