ఓ టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 2 టీ20ల సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 14) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పట్టుబిగించింది. రెండో రోజు ఆట సమయానికి ఆ జట్టు 370 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను (134/1) కొనసాగిస్తోంది. మహ్మదుల్ హసన్ జాయ్ (17) ఔట్ కాగా.. జకీర్ హసన్ (54), నజ్ముల్ హసన్ షాంటో (54) క్రీజ్‌లో ఉన్నారు.
దీనికి ముందు బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు చాపచుట్టేసింది. ఎబాదత్ హొసేన్ (4/47), షొరీఫుల్ ఇస్లాం (2/28), తైజుల్ ఇస్లాం (2/7), మెహిది హసన్ మీరజ్ (2/15) మూకుమ్మడిగా రాణించి, ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మలిక్ (17), నసిర్ జమాల్ (35), జజాయ్ (36), కరీమ్ జనత్ (23) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ హసన్ షాంటో (146) సెంచరీతో కదంతొక్కగా.. మహ్మదుల్ హసన్ (75), ముష్ఫికర్ రహీమ్ (47), మెహిది హసన్ మీరజ్ (48) రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నిజత్ మసూద్ 5 వికెట్లతో చెలరేగగా.. అహ్మద్‌జాయ్ 2, జహీర ఖాన్, అమీర్ హమ్జా, రహ్మత్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment