ఆసియా కప్-2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది హసన్ మీరజ్ (119 బంతుల్లో 112; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హసన్ షాంటో (105 బంతుల్లో 104; 9 ఫోర్లు, సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మీరజ్, షాంటోలు తమతమ వన్డే కెరీర్‌లలో రెండో సెంచరీలు నమోదు చేసి, తమ జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు. 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మీరజ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. 104 పరుగులు చేసి షాంటో రనౌటయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నైమ్ (28), ముష్ఫికర్ రహీం (25), షకీబ్ అల్ హసన్ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. తౌహిద్ హ్రిదోయ్ డకౌటై నిరాశపరిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టగా.. షాంటో, ముష్ఫికర్, షమీమ్ (11) రనౌట్లయ్యారు.
కాగా, ఈ టోర్నీలో నిలబడాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఆ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌కు సైతం ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలిస్తే.. తదుపరి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-4కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది.
గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ ఇదివరకే సూపర్-4కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై నెగ్గిన ఆ జట్టు.. నిన్న (సెప్టెంబర్ 2) టీమిండియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ (మొత్తంగా 3 పాయింట్లు) ఖాతాలో వేసుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పాక్‌తో మ్యాచ్ రద్దు కావడంతో భారత్‌కు సైతం ఓ పాయింట్ దక్కింది. రేపు జరుగబోయే మ్యాచ్‌లో భారత్.. నేపాల్‌పై గెలిస్తే సూపర్-4కు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment