ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, మెల్‌బోర్న్ స్టార్స్ కీలక ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్‌లో మ్యాక్సీ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. మ్యాక్సీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 59.40 సగటున, 194.11 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 297 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను థర్డ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో మ్యాక్సీ మొత్తం 26 సిక్సర్లు బాదాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మ్యాక్సీ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు.
తాజాగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ సుడిగాలి హాఫ్ సెంచరీ చేశాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మ్యాక్స్‌వెల్‌తో పాటు బ్యూ వెబ్‌స్టర్ (31 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ మార్కస్ స్టోయినిస్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో సామ్ హార్పర్ 19 బంతుల్లో 23, థామస్ రోజర్స్ 10 బంతుల్లో 9, కార్ట్‌రైట్ 6 బంతుల్లో 12 పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో మార్కస్ బీన్, నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.
220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్ తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్ల అనంతరం 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కాలెబ్ జువెల్ 5, మిచెల్ ఓవన్ 17 బంతుల్లో 38, చార్లీ వకీమ్ 0, బెన్ మెక్ డెర్మాట్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. నిఖిల్ చౌదరీ 18, మాథ్యూ వేడ్ 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 66 బంతుల్లో 132 పరుగులు చేయాల్సి ఉంది. విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. స్టార్స్ పేసర్ మార్క్ స్టీకిటీ (2-0-8-3) హరికేన్స్‌ను దెబ్బకొట్టాడు. టామ్ కర్రన్ ఓ వికెట్ దక్కింది.
గత నాలుగు మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్ స్కోర్లు..
20*(10)
58*(32)
90(52)
76*(32)
పంజాబ్ కింగ్స్‌కు మంచి రోజులే..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. మ్యాక్సీని పంజాబ్ రూ.4.2 కోట్లకు దక్కించుకుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు (10 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులు చేశాడు).
ఐపీఎల్-2025కి ముందు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి రావడంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు సంబురపడిపోతున్నారు. మ్యాక్సీ ఇదే ఫామ్‌కు కొనసాగిస్తే తమ జట్టుకు మంచి రోజులు వస్తాయని అశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. మ్యాక్స్‌వెల్ గతంలో (2020 సీజన్‌లో) పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment