ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దీని ప్రకారం ఎవరూ సహచర ఆటగాళ్లను కూడా కలవరాదు. అయితే ఈ విషయంలో ఏదైనా సడలింపులు కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీలో టీమిండియా సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నా కలిసి ఆడుకునేందుకు అనుమతినిచ్చారు. ఇంగ్లండ్‌లో ఒక వారం మాత్రమే క్వారంటైన్ ఉండేలా అనుమతించాలని బోర్డు కోరనుంది.
దానికంటే ముందు భారత్‌లోనే ఒక వారం రోజుల పాటు ‘ప్రత్యేక బయో బబుల్’ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఎలాగూ విమానాలు లేవు కాబట్టి క్రికెటర్లంతా ప్రత్యేక విమానంలోనే వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక్కడి బబుల్ నుంచి మరో బబుల్‌లోకి మారడం సులువవుతుంది. ఆటగాళ్లకు దీనివల్ల కొంత అదనపు సమయం లభిస్తుందని బీసీసీఐ చెబుతోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండటంతో పాటు ఐపీఎల్ బబుల్ బద్దలైన తీరు చూస్తే బీసీసీఐకి అంత సులువుగా అనుమతి లభించకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment