కోహ్లికి ఏమైంది?.. అభిమానుల్లో అలజడి రేపిన ఆర్సీబీ పోస్ట్‌ | BCCI Explained Kohli Absence, 1st Time In 13 Years Virat To Miss Full Test Series, RCB Tweet Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: 13 ఏళ్లలో ఇదే తొలిసారి.. మేమంతా నీతోనే! ఆర్సీబీ పోస్ట్‌ వైరల్‌

Published Sat, Feb 10 2024 7:04 PM | Last Updated on Sat, Feb 10 2024 9:24 PM

BCCI Big Statement On Kohli Decision 1st Time In 13 Years RCB Post Viral - Sakshi

విరాట్‌ కోహ్లి (PC: RCB X)

విరాట్‌ కోహ్లికి ఏమైంది? ఈ రన్‌ మెషీన్‌ మళ్లీ ఎప్పుడు మైదానంలో అడుగుపెడతాడు? కోహ్లి ఆట​కు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి? అతడి కుటుంబంలో అంతా బాగానే ఉంది కదా?.. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గురించి క్రికెట్‌ అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఇది.

స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి మెరుపులు చూడాలని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. సెలవును పొడిగిస్తూ ఆఖరి మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండటం లేదు.

ఈ సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లకు సంబంధించిన జట్టును ప్రకటిస్తూ.. కోహ్లి అందుబాటులో ఉండటం లేదని శనివారం ధ్రువీకరించింది. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల విరాట్‌ కోహ్లి సెలక్షన్‌కు అందుబాటులో ఉండటం లేదు. కోహ్లి నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుంది. అతడికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటుంది’’ అని ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారిగా కోహ్లి లేకుండానే టెస్టు సిరీస్‌ ఆడుతున్నట్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు భావోద్వేగ ట్వీట్‌ చేసింది.

‘‘విరాట్‌ కోహ్లి లేకుండా 13 ఏళ్లలో ఇదే మొదటి టెస్టు సిరీస్‌. దేశం మొత్తం నీకు అండగా ఉంది. నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా నీకోసం నీ సింహాసనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కింగ్‌’’ అని ఆర్సీబీ తమ ప్రధాన ఆటగాడు కోహ్లిని ఉద్దేశించి పోస్ట్‌ పెట్టింది.

ఇది చూసిన కోహ్లి అభిమానులు మరింత కంగారుపడుతున్నారు. ‘‘కోహ్లికి అంత కష్టం ఏమొచ్చింది? ఎవరైనా అసలు కారణం చెప్పండి.. కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడని మొన్ననే డివిలియర్స్‌ చెప్పాడు. ఆ తర్వాత అదంతా అబద్ధమంటూ మాట మార్చాడు. 

నిజానికి అనుష్క గర్భవతిగా ఉన్న సమాచారాన్ని ధ్రువీకరించేలా పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయినా.. దీనిపై విరుష్క జోడీ క్లారిటీ ఇవ్వలేదు. 

ఏదేమైనా వామికకు తోబుట్టువు రాబోతున్న మాట నిజమే అయితే, అంతా సవ్యంగా జరగాలి. బుజ్జాయి ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి రావాలి’’ అని ఫ్యాన్స్‌ కోహ్లి కోసం ప్రార్థిస్తున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్‌ డివిలియర్స్‌, స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌ సైతం.. ‘‘కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని కోహ్లికి అండగా నిలిచిన విషయం తెలిసిందే.

నిజానికి.. తండ్రి చనిపోయిన బాధను దిగమింగి రంజీ మ్యాచ్‌ ఆడిన అంకిత భావం కోహ్లిది. అలాంటిది ఇపుడు ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉంటున్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో చర్చిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement