BCCI - Chetan Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి.
ఆడనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు
అందులో.. ‘‘ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. మ్యాచ్ ఆడేందుకు వాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు. 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా సరే ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారు. 85 శాతం ఫిట్‌నెస్ సాధించినా.. ‘‘సర్ ప్లీజ్ మమ్మల్ని ఆడనివ్వండి’’అని బతిమిలాడుతారు.
అయితే, మా వైద్య బృందం మాత్రం అందుకు అనుమతించదు. అయితే, ఆటగాళ్లు మాత్రం ఇలాంటి విషయాలతో పనిలేకుండా తాము ఎల్లప్పుడూ ఆడుతూనే ఉండాలని కోరుకుంటారు.
బుమ్రా విషయమే తీసుకోండి.. అతడు కనీసం కిందకు బెండ్ అవ్వలేకపోతున్నాడు. అలాంటపుడు పాపం తను ఎలా ఆడగలడు? ఒకటీ రెండుసార్లు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే, కొంతమంది మాత్రం 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా.. ‘‘మేము పూర్తి ఫిట్‌గా ఉన్నాము సర్’’’ అని చెప్తారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు.
యాంటీ డోపింగ్ జాబితాలో ఉన్నవే..
అయితే, వాళ్లు వాడేవి ఇంజక్షన్లా లేదంటే పెయిన్ కిల్లర్సా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘వాళ్లు కేవలం ఇంజక్షన్లే వాడతారు. పెయిన్ కిల్లర్లు అస్సలు వాడరు. నిజానికి వాళ్లు ఎలాంటి ఇంజక్షన్ తీసుకున్నారో లేదో మనం కనిపెట్టలేం. పెయిన్ కిల్లర్ల వల్ల డోపింగ్‌లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. యాంటీ డోపింగ్ జాబితాలో ఉండే ఇంజక్షన్లే వాడతారు’’ అని చేతన్ శర్మ పేర్కొన్నాడు.
మరి ఆటగాళ్లు తమంతట తామే ఈ ఇంజక్షన్లు తీసుకుంటారా అని సదరు టీవీ చానెల్ ప్రతినిధి అడుగగా.. ‘‘వాళ్లంతా పెద్ద పెద్ద సూపర్‌స్టార్లు. వాళ్లకు డాక్టర్లు దొరకరా? వేలాది మంది డాక్టర్లు చుట్టూ ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. క్రికెటర్ల ఇంట్లో వాలిపోతారు’’ అంటూ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
నా పనులు నాకుంటాయి..
మరి సెలక్టర్లకు ఈ విషయం తెలియదా అన్న ప్రశ్నకు.. ‘‘వాళ్లు ఇంజక్షన్లు తీసుకున్న విషయం మాకెలా తెలుస్తుంది? మ్యాచ్ ఆడతారు.. ఆరింటి దాకా గ్రౌండ్‌లో ఉంటారు. అప్పటి వరకు టీమ్ మేనేజ్‌మెంట్ వాళ్లతోనే ఉంటుంది. తర్వాత వాళ్లు బస్సులో హోటల్‌కు వెళ్లిపోతారు. ఎవరి గదులు వాళ్లకు ఉంటాయి.
ప్రతి నిమిషం వాళ్లను గమనిస్తూ ఉండలేం కదా.. వాళ్లేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారని ఊరికే వాళ్ల గురించే ఆలోచించం. నాకంటూ నా సొంత పనులు ఉంటాయి. వాకింగ్‌కు వెళ్లటమో, డిన్నర్ చేయడమో.. ఎవరి ప్లాన్లు వాళ్లకు ఉంటాయి కదా! ఎవరు నిబంధనలు అతిక్రమిస్తున్నారో నాకైతే కచ్చితంగా తెలియదు.
2500 మంది ఉన్నారు..
99.9 శాతం మంది ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీకి రిపోర్టు చేస్తారు. అందులో 0.5 శాతం మంది ఇలాంటి పనులు చేస్తారేమో? అది కూడా కచ్చితంగా చెప్పలేం. దాదాపు 2500 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం కష్టం’’ అని చేతన్ శర్మ బదులిచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
వేటు తప్పదా?
కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఆరంభంలో మరోసారి అతడినే చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మ వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చేతన్ శర్మపై కఠిన చర్యలు తప్పవని, వేటు పడే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? చిన్నారి విన్యాసాలకు సచిన్ ఫిదా
IND Vs AUS: శ్రేయాస్ అయ్యర్ ఆగమనం.. వేటు ఎవరిపై?
Comments
Please login to add a commentAdd a comment