Photo Credit : BCCI Twitter
టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆటగాళ్ల రీఫ్రెష్‌మెంట్‌కు రీహాబిలిటేషన్ సెంటర్‌లా ఉపయోగపడాల్సిన సీవోఈ కేంద్రం ఇప్పుడు ఆసుపత్రి వార్డులా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీవోఈలో చికిత్స తీసుకుంటున్న ఆటగాళ్లతో ఒక జట్టునే తయారు చేయొచ్చని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈవో) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీవోఈ కేంద్రంలోని ఆటగాళ్ల పునరావాసం, ఎంత వేగంగా కోలుకుంటున్నారనే దానిపై సమీక్షించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం లక్ష్మణ్‌ను కలిశారు.
వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గాయపడిన క్రీడాకారుడు అనుకున్న సమయానికి వేగంగా కోలుకోవడానికి వారేమీ రోబోలు లేదా యంత్రాలు కాదని స్పష్టం చేశారు. ప్రతీ ఆటగాడి శరీరం స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని, తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన ఆధునిక క్రికెట్లో గాయపడిన ప్లేయర్‌కు అవసరమైనంత కోలుకునే సమయం ఇవ్వడం అత్యంత కీలకమని లక్ష్మణ్ తెలిపాడు. ప్రతి ఒక్కరి నుంచి ఒకే విధమైన రికవరీ సమయాన్ని ఆశించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ స్థానంలో కొత్తగా పునర్నిర్మించిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, వికెట్ కీపర్-బ్యాటర్ సాయి సుదర్శన్, నితీశ్ కుమార్‌రెడ్డి, అశోక్ శర్మ సహా మొత్తంగా 13 మంది ఆటగాళ్లు రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నారు.
అయితే వీరంతా వేగంగా కోలుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించాడు. భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో, వారికి అవసరమైన హై-టెక్ రీహాబిలిటేషన్ సదుపాయాలు అందించడంలో సీవోఈ ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్, ఫిజియోలు, సీవోఈ వైద్య నిపుణుల మధ్య అత్యుత్తమ సమన్వయం ఉందన్న ఆయన.. ఆటగాళ్ల భవిష్యత్తు, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నిపుణుల పర్యవేక్షణలోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు.
నితీశ్ రెడ్డి గాయంపై స్పందించిన లక్ష్మణ్.. ఒక ఆల్‌రౌండర్‌గా పనిభారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం కోసమే అతడిని పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేవరకు శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. ఇక యో-యో అనేది ఆటగాడి అనెరోబిక్ సామర్థ్యాన్ని పరీక్షించే ఒక పరీక్ష అని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లు ఒక సిరీస్‌లో భాగంగా ఉన్నప్పుడు యో-యో చేయడాని వీలు ఉండదు, అంతేకాదు దాని నుంచి కోలుకోవడానికి శరీరానికి చాలా కష్టంగా ఉంటుందన్నాడు.
అందుకే బ్రాంకో టెస్ట్ ఒక కండిషనింగ్ సెషన్‌లా పనిచేస్తుందని, ఇది పరోక్షంగా ఆటగాడి ఫిట్‌నెస్ స్థాయిలను, అనెరోబిక్ ఫిట్‌నెస్ స్థాయిలను కూడా పరీక్షిస్తుందని తెలిపాడు. దీనిని వివిధ వయసుల వారిలో పరిగణనలోకి తీసుకుంటామని, సీజన్ పొడవునా దీనిని నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: నామమాత్రపు మ్యాచ్.. లివింగ్‌స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం


