ముంబై: తప్పుడు వయస్సు ధ్రువీకరణ చూపించి అదనపు ప్రయోజనం పొందేందుకు వర్ధమాన క్రికెటర్లు ప్రయత్నించటం చాలా కాలంగా కొనసాగుతున్నదే. క్రికెట్‌లో కూడా వేర్వేరు వయో విభాగాల్లోని టోర్నీల్లో ఇది ఎన్నో సార్లు బయటపడినా స్వల్ప హెచ్చరికలతో చాలా మంది బయటపడిపోయేవారు. అయితే ఇప్పుడు దీనికి చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. వీరి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకే ముందస్తు హెచ్చరిక జారీ చేస్తూనే అవసరమైతే నిషేధం విధించేందుకు ఉపక్రమిస్తోంది, బోర్డు వద్ద రిజిస్టర్ అయిన క్రికెటర్లలో ఎవరైనా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే వారంతా స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదేశించింది. ఆ తర్వాత తమ విచారణలో గనక తప్పుడు పని చేసినట్లు తేలితే రెండేళ్ల నిషేధం విధిస్తామని ప్రకటించింది. 2021–22 సీజన్‌లో వివిధ వయో విభాగాల టోర్నీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లకు ఇది వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది.
స్వచ్ఛందంగా బయటపడినవారిపై ఎలాంటి చర్య ఉండదని, అసలు పుట్టిన తేదీ ప్రకారం వారు ఏ విభాగానికి అర్హులవుతారో అందులో ఆడేందుకు అవకాశం కూడా ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబరు 15లోగా క్రికెటర్లు పూర్తి వివరాలతో తమ లేఖలు పంపాలని బోర్డు చెప్పింది. ఒక వయో విభాగంలో సమాన వయస్కులు ఉంటేనే సరైన పోటీ ఉంటుందని, అటువంటి వాతావరణం కల్పించేందుకు ఈ చర్యకు సిద్ధమయ్యామని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పగా... క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటున్న బోర్డుకు వర్ధమాన ఆటగాళ్లు సహకరించాలని మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోరారు. మరోవైపు రంజీల్లో సొంత రాష్ట్రంనుంచి కాకుండా ఇతర రాష్ట్రం (మెరుగైన జట్టు) తరఫున ఆడే అవకాశం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు. వారు తప్పు చేసినట్లు రుజువైతే కనీసం రెండేళ్ల నిషేధం వెంటనే అమలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment