Young cricketers
-
ముగ్గురు యువ క్రికెటర్స్ పై కేసు నమోదు
-
కొత్త సంవత్సరంలోనే దేశవాళీ సీజన్: గంగూలీ
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తోన్న ఈ సీజన్ దేశవాళీ క్రికెట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. జనవరి 1 నుంచి దేశవాళీ సీజన్‌ను ప్రారంభించనున్నట్లు శనివారం ప్రకటించాడు. బీసీసీఐ అపెక్స్ మండలిలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పాడు. ‘దేశవాళీ క్రికెట్ గురించి విస్తృతంగా చర్చించాం. 1 జనవరి 2021 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభించాలని నిర్ణయించాం. అన్ని టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు. కానీ రంజీ ట్రోఫీని కచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం’ అని గంగూలీ వెల్లడించాడు. జనవరి–మార్చి వరకు రంజీ ట్రోఫీ నిర్వహించే అవకాశముందన్నాడు. మార్చి, ఏప్రిల్ విండో జూనియర్లు, మహిళల క్రికెట్‌కు కేటాయిస్తామని అన్నాడు. ఆసీస్‌లో భారత పర్యటన గురించి మాట్లాడుతూ ‘క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటన వివరాలను పంపించింది. వాటిపై చర్చించాం. జనవరి మూడో వారంలోగా అక్కడ 4 టెస్టులు ఆడతాం. అక్కడికి వెళ్లాక క్వారంటైన్లో కూడా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు’ అని వివరించాడు. ‘ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మరో నాలుగైదు నెలల సమయం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి షెడ్యూల్‌ను రూపొందిస్తాం. భారత్‌లోనే ఈ సిరీస్ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ సాధ్యంకాకపోతే రెండో ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని పరిశీలిస్తున్నాం’ అని గంగూలీ తెలిపాడు. -
స్వచ్ఛందంగా వెల్లడిస్తే సరి...
ముంబై: తప్పుడు వయస్సు ధ్రువీకరణ చూపించి అదనపు ప్రయోజనం పొందేందుకు వర్ధమాన క్రికెటర్లు ప్రయత్నించటం చాలా కాలంగా కొనసాగుతున్నదే. క్రికెట్లో కూడా వేర్వేరు వయో విభాగాల్లోని టోర్నీల్లో ఇది ఎన్నో సార్లు బయటపడినా స్వల్ప హెచ్చరికలతో చాలా మంది బయటపడిపోయేవారు. అయితే ఇప్పుడు దీనికి చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. వీరి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకే ముందస్తు హెచ్చరిక జారీ చేస్తూనే అవసరమైతే నిషేధం విధించేందుకు ఉపక్రమిస్తోంది, బోర్డు వద్ద రిజిస్టర్ అయిన క్రికెటర్లలో ఎవరైనా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే వారంతా స్వచ్ఛందంగా వెల్లడించాలని ఆదేశించింది. ఆ తర్వాత తమ విచారణలో గనక తప్పుడు పని చేసినట్లు తేలితే రెండేళ్ల నిషేధం విధిస్తామని ప్రకటించింది. 2021–22 సీజన్లో వివిధ వయో విభాగాల టోర్నీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లకు ఇది వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది. స్వచ్ఛందంగా బయటపడినవారిపై ఎలాంటి చర్య ఉండదని, అసలు పుట్టిన తేదీ ప్రకారం వారు ఏ విభాగానికి అర్హులవుతారో అందులో ఆడేందుకు అవకాశం కూడా ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. సెప్టెంబరు 15లోగా క్రికెటర్లు పూర్తి వివరాలతో తమ లేఖలు పంపాలని బోర్డు చెప్పింది. ఒక వయో విభాగంలో సమాన వయస్కులు ఉంటేనే సరైన పోటీ ఉంటుందని, అటువంటి వాతావరణం కల్పించేందుకు ఈ చర్యకు సిద్ధమయ్యామని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పగా... క్రీడా స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటున్న బోర్డుకు వర్ధమాన ఆటగాళ్లు సహకరించాలని మాజీ కెప్టెన్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోరారు. మరోవైపు రంజీల్లో సొంత రాష్ట్రంనుంచి కాకుండా ఇతర రాష్ట్రం (మెరుగైన జట్టు) తరఫున ఆడే అవకాశం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు. వారు తప్పు చేసినట్లు రుజువైతే కనీసం రెండేళ్ల నిషేధం వెంటనే అమలవుతుంది. -
చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!
ముంబై: యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 19 ఏళ్ల కెరీర్ తర్వాత గత ఏడాది అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన యువీ... పలువురు దిగ్గజాలతో కలిసి ఆడాడు. ఈ క్రమంలో ఆటలో, మైదానం బయట కూడా వచ్చిన పలు మార్పులకు అతను ప్రత్యక్ష సాక్షి. తాను ఆడిన సమయానికి, ఇప్పటి తరానికి మధ్య పలు వ్యత్యాసాలు వచ్చినా... సీనియర్లకు గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం ఈతరం ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి కనబడుతోందని అతను అభిప్రాయపడ్డాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో సాగిన సంభాషణలో అతను ఈ వ్యాఖ్య చేశాడు. నిజానికి మార్గనిర్దేశనం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్లు లేరని యువరాజ్ అన్నాడు. యువీ తొలి మ్యాచ్ ఆడే సమయానికి జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్నారు. ‘మా సీనియర్లు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఏకాగ్రత చెదిరే అవకాశాలు కూడా తక్కువ. సీనియర్లను చూసి మేం చాలా నేర్చుకునేవాళ్లం. ఎలా ఆడతారు, ఎంతగా కష్టపడతారు, జనంతో ఎలా మాట్లాడతారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అనేవి తెలుసుకున్నాం. వారిలాగే ఉండేలా ప్రయత్నించేవాళ్లం. వచ్చే పదేళ్లు భారత్‌కు ఆడాలంటే మీరు ఇలా ఉండాలి అంటూ వారు మార్గనిర్దేశనం చేశారు’ అని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఇద్దరి తప్ప... నాటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అతను అన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే వారిలో కోహ్లి, రోహిత్ తప్ప సీనియర్లు ఎవరూ లేరని చెప్పాడు. ‘ఈతరం కుర్రాళ్లను చూస్తే కొంత బాధ వేస్తుంది. మనకు అండగా నిలిచి సరైన దారిని చూపే వారు ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తే జట్టులో అలాంటివారే కనిపించడం లేదు. ఫలితంగా సీనియర్లంటే గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మేం ఎవరినైనా ఏదైనా అన్నట్లుగా యువ ఆటగాళ్లు తయారయ్యారు’ అని ఈ మాజీ ఆల్‌రౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూనియర్ల ఇష్టారాజ్యం... ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ నిషేధానికి గురి కావడానికి ఇది కూడా కారణమని యువరాజ్ విశ్లేషించాడు. ‘సోషల్ మీడియా, పార్టీలులాంటివే పాండ్యా, రాహుల్ ఘటనకు కారణం. మా రోజుల్లో అయితే ఇలాంటిది కచ్చితంగా జరిగి ఉండకపోయేది. అసలు ఊహించలేం కూడా. మేం సీనియర్లకు ఇచ్చే గౌరవం కారణంగా వారు సరైన దారిలో పెట్టేవారు. ఇలాంటి పనులు చేయకండి. ఇది మంచిది కాదు అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జూనియర్లు తాము ఏమనుకుంటే అది చేస్తున్నారు’ అని 2011 వరల్డ్‌కప్ విన్నర్ అభిప్రాయపడ్డాడు. అకస్మాత్తుగా వచ్చే డబ్బుతోనే... అయితే తాను కుర్రాళ్లను పూర్తిగా తప్పు పట్టడం లేదని, ఐపీఎల్ కారణంగా అకస్మాత్తుగా వచ్చి పడుతున్న భారీ మొత్తం వారితో ఇలాంటి పనులు చేయిస్తోందని యువరాజ్ వ్యాఖ్యానించాడు. ‘కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే చాలు ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తోంది. చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోంది. వారు కెరీర్ ఆరంభంలోనే ఉన్నారు. ఇంకా భారత్ తరఫున కూడా ఆడలేదు కానీ ఆర్జన మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో వారికి తెలియడం లేదు. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు. ఇలాంటప్పుడు సీనియర్లు, కోచ్‌ల మార్గనిర్దేశనం కావాలి. మైదానంలో శ్రమించాలని, దేశానికి ఆడటమే ముఖ్యమని వారికి తెలియాలి. నువ్వు బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయి అని సచిన్ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు’ అని యువీ చెప్పాడు. ‘టెస్టు’లపై నేటితరం అనాసక్తి... ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లినప్పుడు కొందరు యువ ఆటగాళ్లను పరిశీలించానని, వారు టెస్టులు ఆడాలని ఏమాత్రం కోరుకోవడం లేదనే విషయం తనకు అర్థమైందని యువరాజ్ అన్నాడు. తమ రాష్ట్రం తరఫున రంజీల్లో కూడా ఆడాలని భావించడం లేదని, ఐపీఎల్ ఉంటే చాలనుకుంటున్నారని అతను పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని సూచించిన యువరాజ్... వివిధ పిచ్‌లపై ఆడి రాటుదేలితే భారత్ తరఫున కూడా బాగా ఆడగలరని అభిప్రాయ పడ్డాడు. యువీతో సంభాషించే క్రమంలో రోహిత్ శర్మ కూడా ... తన పరిధిలో జూనియర్లతో మాట్లాడుతుంటానని, వారికి సరైన దిశ చూపించేందుకు ప్రయత్నిస్తుంటానని వివరించాడు. -
ఐపీఎల్ లేకపోతే ఎలా?
ఐపీఎల్ అంటే కొత్త కుర్రాళ్లకు ఒక కలల ప్రపంచం... తొలిసారి లీగ్‌లో ఆడే అవకాశం రావడంతో పాటు గుర్తింపు కోసం ఇది మంచి అవకాశం. ఆర్థికంగా ఆయా ఆటగాళ్లను ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఒక్క సీజన్ సరిపోతుంది. అలాంటిది లీగ్ జరగకపోతే ఇక ఈ ఏడాది ఆట గురించి, డబ్బు గురించి మరచిపోవడమే! ముంబై: కరోనా కారణంగా ఈసారి 2020 ఐపీఎల్ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది. అంతా చక్కబడితే సెప్టెంబరు–అక్టోబరు సమయంలో లీగ్ జరగవచ్చని వినిపిస్తున్నా... అది అంత సులువు కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్లకు రూపాయి కూడా చెల్లించలేమని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ జట్టుతో పాటు ఉన్న మ్యాచ్‌లకే లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఇక టోర్నీనే ఉండకపోతే సహజంగానే డబ్బులు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడవు. ‘ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీని ప్రకారం లీగ్ ఆరంభానికి వారం ముందు కాంట్రాక్ట్ మొత్తంలో 15 శాతం, టోర్నీ జరిగే సమయంలో 65 శాతం, టోర్నీ ముగిశాక మిగిలిన 20 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక్క ఆటగాడికి కూడా రూపాయి ఇవ్వలేం’ అని ఒక టీమ్ యజమాని స్పష్టం చేశారు. కరోనాలాంటి విపత్తు గురించి ఇన్సూరెన్స్ ఒప్పందాల్లో కూడా లేదు. ‘బీమా నిబంధనల్లో కరోనా గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎలాంటి చెల్లింపులు జరపవు. ప్రతీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 75 కోట్లనుంచి రూ. 80 కోట్ల వరకు ఉంటుంది. ఆటనే జరగకపోతే మేం ఎక్కడినుంచి తెస్తాం’ అని మరో ఫ్రాంచైజీ యజమాని వెల్లడించారు. చర్చించాల్సి ఉంది! కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో ఆదాయం తగ్గి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్ల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్‌లోనూ అలా జరిగితే ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెటర్లకు కూడా పూర్తి మొత్తం అందకపోవచ్చు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ యువ ఆటగాళ్ల సంక్షేమం గురించి ఆలోచించాలని ఒక మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ రద్దయితే కోహ్లి, ధోనిలాంటి వారికి కూడా దెబ్బే. అయితే దానిని వారు తట్టుకోగలరు. మొదటి సారి లీగ్ ఆడబోతున్నవారికే ఆర్థికంగా సమస్య. ఏడాదంతా కష్టపడి అవకాశం దక్కించుకున్న రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షల కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు మాత్రం చాలా కష్టం. బోర్డు వీరి గురించి ఆలోచిస్తే బాగుంటుంది’ అని ఆయన సూచించారు. అయితే బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ‘బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ అతి పెద్ద టోర్నమెంట్. అయితే కోతల గురించి ఇంకా చర్చ జరగలేదు. మున్ముందు మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్కలు, నష్టాల గురించి అంచనాలు వేయడం అంత సులువు కాదు. ఆఫీస్ బేరర్లందరూ సమావేశమైతే తప్ప గణాంకాల గురించి ఇప్పుడే చెప్పలేం’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి సుమారు 3 వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా మాత్రం బోర్డును సమర్థించారు. ‘బోర్డుకు డబ్బు వచ్చేదే క్రికెట్ నుంచి. అసలు ఆట జరగకపోతే ఆదాయం ఎలా. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆటగాళ్లపైనే కాదు దీని ప్రభావం చాలా మందిపై ఉంటుంది. అయితే ఇది బోర్డు తప్పు కాదు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఐపీఎల్: ఉప్పొంగిన 'యువ'కెరటాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పది సంవత్సరాలుగా భారత యువ టాలెంట్ కు వేదికైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లకు భవిష్యత్తునిచ్చింది. కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గల్లీ క్రికెటర్లకు సైతం కల్పించింది. ఇలా ప్రతి సీజన్లో ఓ గల్లీ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ అసాధరణ ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాల ప్రదర్శన పై ఓ లుక్కెద్దాం.. నితీష్ రాణా- ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉందంటే నితీష్ రాణా బ్యాట్ ఝలిపించడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో178 పరుగుల చేజింగ్ లో ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా 29 బంతుల్లో 50 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజారత్ పై 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్య చేదనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో ముఖ్యపాత్ర వహించాడు. 13 మ్యాచ్ లు ఆడిన రాణా మూడు అర్ద సెంచరీలతో 333 పరుగులు చేశాడు. బసీల్ తంపి- గుజరాత్ లయన్స్: గుజరాత్ లయన్స్ పేసర్ బసీల్ తంపి గంటకు140 కీ.మీ వేగంతో బంతిని విసరగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగుల ఇవ్వకుండా కట్టడిచేయడంలో దిట్ట. యార్కర్లు, స్టో డెలివరీలు వేస్తు ప్రత్యర్ధులను కట్టిడిచేసిన తంపి 12 మ్యాచుల్లో 3/29 ఉత్తమ ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయిన తన ప్రతిభను చాటుకున్నాడు. రాహుల్ త్రిపాఠి: రైజింగ్ పుణె ఫైనల్ చేరడంలో త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ తో రాబట్టాడు. ఈ సీజన్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇక కోల్ కతా తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 98 పరుగులతో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించాడు. 12 మ్యాచ్ లు ఆడిన త్రిపాఠి 2 అర్ధ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు. రిషబ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్: ఈ సీజన్లో అసాధారణ ప్రతిభతో అభిమానుల మనసు దోచుకున్న యంగ్ క్రికెటర్ గా పంత్ గుర్తింపు పొందాడు. తన ఆట తీరుతో ఏకంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్..వారితో మా ఫ్యూచర్ ధోని రిషబ్ పంతే అనేలా చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటి చేత్తో గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్ ద్రావిడ్ మాత్రం టీం ఇండియా ఫ్యూచర్ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణాంతరం ఐపీఎల్ లో పాల్గొన్న పంత్ బెంగళూరు పై ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులును కదిలించింది.14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్- సన్ రైజర్స్ హైదరాబాద్: కేవలం భారత క్రికెటర్లకే కాకుండా క్రికెట్ ఆడే చిన్నదేశాల ఆటగాళ్లను సైతం వెలుగులోకి తెచ్చింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ సీజన్లో అప్ఘన్ బౌలర్ అసాధరణ ప్రతిభకు క్రికెట్ అభిమానులు దాసోహం అన్నారు. ఐపీఎల్ వేలం అధిక ధర రూ.4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్ ను తీసుకోవడం అందరీని ఆశ్చర్య పరిచింది. కానీ సన్ రైజర్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణించాడు రషీద్. 13 మ్యాచులు ఆడిన అప్ఘన్ బౌలర్ 17 వికెట్లు పడగొట్టాడు. -
విశాఖలో క్రికెట్ సందడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: యువ క్రికెటర్ల టోర్నీలకు తరచుగా ఆతిథ్యం ఇస్తున్న విశాఖపట్నంలో మరోసారి కుర్రాళ్లు సందడి చేయనున్నారు. భారత్ ‘ఎ’- న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య సిరీస్ నేడు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఒక మూడు రోజుల మ్యాచ్, ఒక నాలుగు రోజుల మ్యాచ్, మూడు వన్డేలు నిర్వహిస్తారు. మూడు రోజుల మ్యాచ్ బుధవారం నుంచి పోర్ట్ స్టేడియంలో జరుగుతుంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ వైఎస్ఆర్ వీడీసీఏ స్టేడియంలో జరుగుతాయి. భారత్ యువ జట్టుకు అభిషేక్ నాయర్, న్యూజిలాండ్ జట్టుకు లాథమ్ సారథ్యం వహిస్తున్నారు. భారత్ ఆడే వన్డే సిరీస్‌కు మాత్రం ఉన్ముక్త్ చంద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మంగళవారం ఇరు జట్లు వైఎస్ఆర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి.