ఐపీఎల్ అంటే కొత్త కుర్రాళ్లకు ఒక కలల ప్రపంచం... తొలిసారి లీగ్‌లో ఆడే అవకాశం రావడంతో పాటు గుర్తింపు కోసం ఇది మంచి అవకాశం. ఆర్థికంగా ఆయా ఆటగాళ్లను ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఒక్క సీజన్ సరిపోతుంది. అలాంటిది లీగ్ జరగకపోతే ఇక ఈ ఏడాది ఆట గురించి, డబ్బు గురించి మరచిపోవడమే!
ముంబై: కరోనా కారణంగా ఈసారి 2020 ఐపీఎల్ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది. అంతా చక్కబడితే సెప్టెంబరు–అక్టోబరు సమయంలో లీగ్ జరగవచ్చని వినిపిస్తున్నా... అది అంత సులువు కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్లకు రూపాయి కూడా చెల్లించలేమని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ జట్టుతో పాటు ఉన్న మ్యాచ్‌లకే లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఇక టోర్నీనే ఉండకపోతే సహజంగానే డబ్బులు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడవు. ‘ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీని ప్రకారం లీగ్ ఆరంభానికి వారం ముందు కాంట్రాక్ట్ మొత్తంలో 15 శాతం, టోర్నీ జరిగే సమయంలో 65 శాతం, టోర్నీ ముగిశాక మిగిలిన 20 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక్క ఆటగాడికి కూడా రూపాయి ఇవ్వలేం’ అని ఒక టీమ్ యజమాని స్పష్టం చేశారు. కరోనాలాంటి విపత్తు గురించి ఇన్సూరెన్స్ ఒప్పందాల్లో కూడా లేదు. ‘బీమా నిబంధనల్లో కరోనా గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎలాంటి చెల్లింపులు జరపవు. ప్రతీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 75 కోట్లనుంచి రూ. 80 కోట్ల వరకు ఉంటుంది. ఆటనే జరగకపోతే మేం ఎక్కడినుంచి తెస్తాం’ అని మరో ఫ్రాంచైజీ యజమాని వెల్లడించారు.
చర్చించాల్సి ఉంది!
కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో ఆదాయం తగ్గి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్ల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్‌లోనూ అలా జరిగితే ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెటర్లకు కూడా పూర్తి మొత్తం అందకపోవచ్చు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ యువ ఆటగాళ్ల సంక్షేమం గురించి ఆలోచించాలని ఒక మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ రద్దయితే కోహ్లి, ధోనిలాంటి వారికి కూడా దెబ్బే. అయితే దానిని వారు తట్టుకోగలరు. మొదటి సారి లీగ్ ఆడబోతున్నవారికే ఆర్థికంగా సమస్య. ఏడాదంతా కష్టపడి అవకాశం దక్కించుకున్న రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షల కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు మాత్రం చాలా కష్టం. బోర్డు వీరి గురించి ఆలోచిస్తే బాగుంటుంది’ అని ఆయన సూచించారు. అయితే బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
‘బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ అతి పెద్ద టోర్నమెంట్. అయితే కోతల గురించి ఇంకా చర్చ జరగలేదు. మున్ముందు మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్కలు, నష్టాల గురించి అంచనాలు వేయడం అంత సులువు కాదు. ఆఫీస్ బేరర్లందరూ సమావేశమైతే తప్ప గణాంకాల గురించి ఇప్పుడే చెప్పలేం’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి సుమారు 3 వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా మాత్రం బోర్డును సమర్థించారు. ‘బోర్డుకు డబ్బు వచ్చేదే క్రికెట్ నుంచి. అసలు ఆట జరగకపోతే ఆదాయం ఎలా. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆటగాళ్లపైనే కాదు దీని ప్రభావం చాలా మందిపై ఉంటుంది. అయితే ఇది బోర్డు తప్పు కాదు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment