హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత పది సంవత్సరాలుగా భారత యువ టాలెంట్ కు వేదికైన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లకు భవిష్యత్తునిచ్చింది. కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన క్రికెట్ అవకాశాలను గల్లీ క్రికెటర్లకు సైతం కల్పించింది. ఇలా ప్రతి సీజన్లో ఓ గల్లీ క్రికెటర్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమయ్యారు. విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోమంటూ అసాధరణ ప్రతిభ కనబరుస్తున్న యువ కెరటాల ప్రదర్శన పై ఓ లుక్కెద్దాం..
నితీష్ రాణా- ముంబై ఇండియన్స్: ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉందంటే నితీష్ రాణా బ్యాట్ ఝలిపించడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో178 పరుగుల చేజింగ్ లో ఏమాత్రం ఒత్తిడికి గురవ్వకుండా 29 బంతుల్లో 50 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజారత్ పై 53 పరుగులు, కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్య చేదనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో ముఖ్యపాత్ర వహించాడు. 13 మ్యాచ్ లు ఆడిన రాణా మూడు అర్ద సెంచరీలతో 333 పరుగులు చేశాడు.
బసీల్ తంపి- గుజరాత్ లయన్స్: గుజరాత్ లయన్స్ పేసర్ బసీల్ తంపి గంటకు140 కీ.మీ వేగంతో బంతిని విసరగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో పరుగుల ఇవ్వకుండా కట్టడిచేయడంలో దిట్ట. యార్కర్లు, స్టో డెలివరీలు వేస్తు ప్రత్యర్ధులను కట్టిడిచేసిన తంపి 12 మ్యాచుల్లో 3/29 ఉత్తమ ప్రదర్శనతో 11 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ చేరుకోలేకపోయిన తన ప్రతిభను చాటుకున్నాడు.
రాహుల్ త్రిపాఠి: రైజింగ్ పుణె ఫైనల్ చేరడంలో త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించాడు. కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్ తో రాబట్టాడు. ఈ సీజన్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాడు. ఇక కోల్ కతా తో జరిగిన లీగ్ మ్యాచ్ లో 98 పరుగులతో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించాడు. 12 మ్యాచ్ లు ఆడిన త్రిపాఠి 2 అర్ధ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు.
రిషబ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్: ఈ సీజన్లో అసాధారణ ప్రతిభతో అభిమానుల మనసు దోచుకున్న యంగ్ క్రికెటర్ గా పంత్ గుర్తింపు పొందాడు. తన ఆట తీరుతో ఏకంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్..వారితో మా ఫ్యూచర్ ధోని రిషబ్ పంతే అనేలా చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటి చేత్తో గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్ననలు పొందాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్ ద్రావిడ్ మాత్రం టీం ఇండియా ఫ్యూచర్ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణాంతరం ఐపీఎల్ లో పాల్గొన్న పంత్ బెంగళూరు పై ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులును కదిలించింది.14 మ్యాచులు ఆడిన పంత్ 366 పరుగులు చేశాడు.
రషీద్ ఖాన్- సన్ రైజర్స్ హైదరాబాద్: కేవలం భారత క్రికెటర్లకే కాకుండా క్రికెట్ ఆడే చిన్నదేశాల ఆటగాళ్లను సైతం వెలుగులోకి తెచ్చింది ఐపీఎల్. ఈ ఐపీఎల్ కు ముందు రషీద్ ఖాన్ అంటే ఎవరికి తెలియదు. కానీ ఈ సీజన్లో అప్ఘన్ బౌలర్ అసాధరణ ప్రతిభకు క్రికెట్ అభిమానులు దాసోహం అన్నారు. ఐపీఎల్ వేలం అధిక ధర రూ.4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్ ను తీసుకోవడం అందరీని ఆశ్చర్య పరిచింది. కానీ సన్ రైజర్స్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాణించాడు రషీద్. 13 మ్యాచులు ఆడిన అప్ఘన్ బౌలర్ 17 వికెట్లు పడగొట్టాడు.