చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు! | Yuvraj Singh Instagram chat with Rohit Sharma | Sakshi
Sakshi News home page

చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!

Published Thu, Apr 9 2020 12:04 AM | Last Updated on Thu, Apr 9 2020 12:04 AM

Yuvraj Singh Instagram chat with Rohit Sharma - Sakshi

యువరాజ్‌ సింగ్‌

ముంబై: యువరాజ్‌ సింగ్‌ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 19 ఏళ్ల కెరీర్‌ తర్వాత గత ఏడాది అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన యువీ... పలువురు దిగ్గజాలతో కలిసి ఆడాడు. ఈ క్రమంలో ఆటలో, మైదానం బయట కూడా వచ్చిన పలు మార్పులకు అతను ప్రత్యక్ష సాక్షి. తాను ఆడిన సమయానికి, ఇప్పటి తరానికి మధ్య పలు వ్యత్యాసాలు వచ్చినా... సీనియర్లకు గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం ఈతరం ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి కనబడుతోందని అతను అభిప్రాయపడ్డాడు. భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో సాగిన సంభాషణలో అతను ఈ వ్యాఖ్య చేశాడు.

నిజానికి మార్గనిర్దేశనం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్లు లేరని యువరాజ్‌ అన్నాడు. యువీ తొలి మ్యాచ్‌ ఆడే సమయానికి జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్నారు. ‘మా సీనియర్లు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. అప్పట్లో సోషల్‌ మీడియా లేదు కాబట్టి ఏకాగ్రత చెదిరే అవకాశాలు కూడా తక్కువ. సీనియర్లను చూసి మేం చాలా నేర్చుకునేవాళ్లం. ఎలా ఆడతారు, ఎంతగా కష్టపడతారు, జనంతో ఎలా మాట్లాడతారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అనేవి తెలుసుకున్నాం. వారిలాగే ఉండేలా ప్రయత్నించేవాళ్లం. వచ్చే పదేళ్లు భారత్‌కు ఆడాలంటే మీరు ఇలా ఉండాలి అంటూ వారు మార్గనిర్దేశనం చేశారు’ అని యువరాజ్‌ గుర్తు చేసుకున్నాడు.  

ఆ ఇద్దరి తప్ప...
నాటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అతను అన్నాడు. మూడు ఫార్మాట్‌లు ఆడే వారిలో కోహ్లి, రోహిత్‌ తప్ప సీనియర్లు ఎవరూ లేరని చెప్పాడు. ‘ఈతరం కుర్రాళ్లను చూస్తే కొంత బాధ వేస్తుంది. మనకు అండగా నిలిచి సరైన దారిని చూపే వారు ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తే జట్టులో అలాంటివారే కనిపించడం లేదు. ఫలితంగా సీనియర్లంటే గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మేం ఎవరినైనా ఏదైనా అన్నట్లుగా యువ ఆటగాళ్లు తయారయ్యారు’ అని ఈ మాజీ          ఆల్‌రౌండర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  

జూనియర్ల ఇష్టారాజ్యం...
ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ నిషేధానికి గురి కావడానికి ఇది కూడా కారణమని యువరాజ్‌ విశ్లేషించాడు. ‘సోషల్‌ మీడియా, పార్టీలులాంటివే పాండ్యా, రాహుల్‌ ఘటనకు కారణం. మా రోజుల్లో అయితే ఇలాంటిది కచ్చితంగా జరిగి ఉండకపోయేది. అసలు ఊహించలేం కూడా. మేం సీనియర్లకు ఇచ్చే గౌరవం కారణంగా వారు సరైన దారిలో పెట్టేవారు. ఇలాంటి పనులు చేయకండి. ఇది మంచిది కాదు అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జూనియర్లు తాము ఏమనుకుంటే అది చేస్తున్నారు’ అని 2011 వరల్డ్‌కప్‌ విన్నర్‌ అభిప్రాయపడ్డాడు.  

అకస్మాత్తుగా వచ్చే డబ్బుతోనే...
అయితే తాను కుర్రాళ్లను పూర్తిగా తప్పు పట్టడం లేదని, ఐపీఎల్‌ కారణంగా అకస్మాత్తుగా వచ్చి పడుతున్న భారీ మొత్తం వారితో ఇలాంటి పనులు చేయిస్తోందని యువరాజ్‌ వ్యాఖ్యానించాడు. ‘కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే చాలు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తోంది. చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోంది. వారు కెరీర్‌ ఆరంభంలోనే ఉన్నారు. ఇంకా భారత్‌ తరఫున కూడా ఆడలేదు కానీ ఆర్జన మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో వారికి తెలియడం లేదు. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు. ఇలాంటప్పుడు సీనియర్లు, కోచ్‌ల మార్గనిర్దేశనం కావాలి. మైదానంలో శ్రమించాలని, దేశానికి ఆడటమే ముఖ్యమని వారికి తెలియాలి. నువ్వు బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయి అని సచిన్‌ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు’ అని యువీ చెప్పాడు.  

‘టెస్టు’లపై నేటితరం అనాసక్తి...
ఇటీవల జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లినప్పుడు కొందరు యువ ఆటగాళ్లను పరిశీలించానని, వారు టెస్టులు ఆడాలని ఏమాత్రం కోరుకోవడం లేదనే విషయం తనకు అర్థమైందని యువరాజ్‌ అన్నాడు. తమ రాష్ట్రం తరఫున రంజీల్లో కూడా ఆడాలని భావించడం లేదని, ఐపీఎల్‌ ఉంటే చాలనుకుంటున్నారని అతను పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌ తప్పనిసరిగా ఆడాలని సూచించిన యువరాజ్‌... వివిధ పిచ్‌లపై ఆడి రాటుదేలితే భారత్‌ తరఫున కూడా బాగా ఆడగలరని అభిప్రాయ పడ్డాడు. యువీతో సంభాషించే క్రమంలో రోహిత్‌ శర్మ కూడా ... తన పరిధిలో జూనియర్లతో మాట్లాడుతుంటానని, వారికి సరైన దిశ చూపించేందుకు ప్రయత్నిస్తుంటానని వివరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement