బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా తొలగింపుపై ఎంత డ్రామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మంగళవారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది.
తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. కొత్త కార్యవర్గంలో రోజర్ బిన్నీ (అధ్యక్షుడు.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా , సంయుక్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా,కోశాధికారిగా ఆశిష్ షెలార్‌లు నియమితులయ్యారు.
గంగూలీని పదవి నుంచి తొలగించిన బీసీసీఐ ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్.. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వర్గంపై కన్నువేసింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2020 డిసెంబర్‌లో కొత్త సెలక్షన్ కమిటీని నియమించాడు. సెలక్షన్ కమిటీలోచేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఉన్నారు.
తాజాగా చేతన్ శర్మ బృంధం తమ పదవులను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉన్నప్పటికి కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ధోరణిలోనే కొత్త పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబరిచిన చేతన్ శర్మను తొలగించకపోయినా.. అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా చేసే ప్రదర్శన ఆధారంగానే సెలక్షన్ కమిటీ పదవుల మార్పుపై ఒక స్పష్టత రానుంది.
వీరి స్థానాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లు.. ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్, బెంగాల్ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్ సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే వీరిలో రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించకపోవడం అతనికి మైనస్. దీనిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం బెంగాల్‌కే చెందిన మాజీ వన్డే ప్లేయర్ లక్ష్మీ రతన్ శుక్లా లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్‌లో ఒకరిని తీసుకోవచ్చని తెలుస్తోంది.
చదవండి: 'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై
Comments
Please login to add a commentAdd a comment