
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు, వన్డే సిరీస్‌లు నిరాటంకంగా కొనసాగనున్నాయి. ఒమిక్రాన్ సహా ఏ ఇతర కరోనా వేరియంట్ వచ్చినా, ఆటగాళ్లకు సోకినా మ్యాచ్‌లు జరుగుతాయి తప్ప వాయిదా, రద్దు అనేదే ఉండదు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బోర్డుల మధ్య పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది. ఆటగాళ్లు, లేదంటే సిబ్బందిలో ఎవరికైనా కోవిడ్ సోకితే సదరు వ్యక్తుల్నే ఐసోలేషన్‌కు పంపిస్తారు. సన్నిహితంగా మెలిగిన వారిని బలవంతంగా ఐసోలేషన్‌కు తరలించబోమని సీఎస్‌ఏ మెడికల్ ఆఫీసర్ షుయెబ్ మంజ్రా తెలిపారు. ‘ఇరు బోర్డుల మధ్య మెడికల్ ప్రొటోకాల్ ఒప్పందం కుదిరింది.
బయో బబుల్‌లోని వారంతా టీకా తీసుకున్నారు. పొరపాటున ఎవరికైనా వైరస్ సోకినా హోటల్‌లో వేరుగా ఉంచుతారు. మ్యాచ్‌లను మాత్రం కొనసాగిస్తాం’ అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు నిష్ణాతులైన వైద్య సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆటగాళ్లకు, సిబ్బంది, హోటల్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందికి ప్రతి రోజు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తూనే ఉంటామని మంజ్రా వివరించారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ ఆదివారం సెంచూరియన్‌లో మొదలవుతుంది. జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment