క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు.
గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్‌లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా.
నా ఫిట్‌నెస్‌ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు.
సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment