చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. అరుదైన రికార్డు | Ben Stokes Makes History Becomes 1st England Player Ever Sensational Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తొలి ప్లేయర్‌గా రికార్డు

Published Fri, Jul 12 2024 11:47 AM | Last Updated on Fri, Jul 12 2024 12:56 PM

Ben Stokes Makes History Becomes 1st England Player Ever Sensational Feat

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్‌ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే
ఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్‌ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే వెస్టిండీస్‌ను ఆలౌట్‌ చేసిన ఇంగ్లండ్‌.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన విండీస్‌ జట్టుకు ఇంగ్లండ్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, అరంగేట్ర బౌలర్‌ గుస్‌ అట్కిన్సన్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రెండేసి వికెట్లు కూల్చారు.

ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా విండీస్‌
ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్‌ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే.. విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ ఓపెనర్‌ మిక్లే లూయీస్‌(14), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కిర్క్‌ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లోనూ మిక్లే లూయీస్‌(27) స్టోక్సే అవుట్‌ చేయడం విశేషం.

చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌..  అరుదైన రికార్డు
ఈ క్రమంలో స్టోక్స్‌ టెస్టుల్లో అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు.

ఓవరాల్‌గా.. వెస్టిండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ జాక్వెస్‌ కలిస్‌ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.

కాగా 103 టెస్టుల్లో స్టోక్స్‌ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.

ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పేస్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ బంతితో రాణించినా.. బ్యాట్‌తో మ్యాజిక్‌ చేయలేకపోయాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్‌ మోటీ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.
 చదవండి: KKR: ద్రవిడ్‌ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement