Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ భువనేశ్వర్‌కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 199 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు.
2011లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్‌లు, ఎస్‌ఆర్‌హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్‌లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్‌లు ఆడాడు.
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా..
మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్‌లు (2008-2025)
రోహిత్ శర్మ: 277 మ్యాచ్‌లు (2008-2026)
విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్‌లు (2008-2026)
రవీంద్ర జడేజా: 264 మ్యాచ్‌లు (2008-2026)
దినేష్ కార్తీక్: 257 మ్యాచ్‌లు (2008-2024)
శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌లు (2008-2024)
రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్‌లు (2009-2025)
అజింక్య రహానే: 207 మ్యాచ్‌లు (2008-2026)
సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు (2008-2021)
రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్‌లు (2008-2022)
అంబటి రాయుడు: 204 మ్యాచ్‌లు (2010-2023)
భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్‌లు (2011-2026)


