
ఇటీవలి కాలంలో టీమిండియా రిజర్వ్ బెంచ్ ఎంత పటిష్టంగా తయారైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఓ పక్క అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే.. మరో పక్క శిఖర్ ధవన్ సారధ్యంలోని ఇండియా-బి టీమ్ సైతం అదే స్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.
తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో పరాజయం మినహాయించి భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తుందనే చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రతి టీమిండియా ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
అక్కడికీ రొటేషన్ పేరుతో సీనియర్లకు అప్పుడప్పుడూ విశ్రాంతినిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాము లాగే మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు టీమిండియా ఎంపికపై ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని జోస్యం చెప్పాడు.
ప్రతి ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం అద్భుతమని కొనియాడాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్ కనబర్చిన పోరాటపటిమ అద్భుతమని ఆకాశానికెత్తాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్, శ్రేయస్ అయ్యర్ చూపించిన పరిణితి అభినందనీయమని పేర్కొన్నాడు. ఇలా ఆటగాళ్లు పోటీపడి రాణిస్తే జట్టు ఎంపిక చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు.