టీమిండియాకు ఊహించని షాక్‌.. సూర్యకుమార్‌ గాయం తీవ్రం! ఇక నుంచి.. | Blow To Team India Suryakumar Out Of Action Till February Tear in Ankle: Report | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఊహించని షాక్‌.. సూర్యకుమార్‌ గాయం తీవ్రం! నెలల పాటు..

Published Sat, Dec 23 2023 9:48 AM | Last Updated on Sat, Dec 23 2023 10:12 AM

Blow To Team India Suryakumar Out Of Action Till February Tear in Ankle: Report - Sakshi

Suryakumar Yadav out of action till..: అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సుమారు నెలన్నర పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో పేర్కొంది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో దుమ్ములేపాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా సత్తా
సొంతగడ్డపై.. తొలిసారిగా టీమిండియా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. 4-1తో ఆసీస్‌పై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ నెగ్గాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసి సత్తా చాటాడు. ఆటగాడిగా, సారథిగా అద్భుతంగా రాణించి సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు.

సౌతాఫ్రికాలో సుడిగాలి శతకంతో చెలరేగి
ముఖ్యంగా సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. 56 బంతుల్లోనే 100 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా 106 పరుగుల తేడాతో భారీ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 

అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగానే సూర్యకుమార్‌ యాదవ్‌ గాయపడిన విషయం తెలిసిందే. జొహన్నస్‌బర్గ్‌లో డిసెంబరు 16న జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో సూర్య అదుపుతప్పి కిందపడిపోయాడు. 

గాయం తీవ్రం.. 
దీంతో అతడి మడిమ మెలిక పడింది. ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడిన సూర్యను పర్యవేక్షించి చికిత్స అందించింది వైద్య బృందం. ఈ నేపథ్యంలో సూర్య మైదానాన్ని వీడగా రవీంద్ర జడేజా సారథిగా వ్యవహరించాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం సూర్య మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు.

కానీ.. తాజా సమాచారం ప్రకారం.. సూర్య చీలమండ నొప్పి తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్‌​ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘కోలుకోవడానికి సూర్యకుమార్‌కు మరికొంత సమయం కావాలి. 

అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు దూరం
జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన అనంతరం ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. అయితే, అతడు కచ్చితంగా అఫ్గనిస్తాన్‌ సిరీస్‌కు మాత్రం దూరమవుతాడు’’ అని పేర్కొన్నాయి. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ఆడనుంది. 

ఇప్పటికే రోహిత్‌ శర్మ టీ20లకు దూరంగా ఉండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా ఆటకు విరామం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన సూర్య సైతం ఇలా జట్టుకు దూరం కావడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది.

జూన్‌ నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు ఇలా వరుస ఎదురుదెబ్బలు తగలడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అఫ్గన్‌తో తమ ఆఖరిసారి టీ20 సిరీస్‌ ఆడనుంది.

చదవండి: అది గతం.. ఇప్పుడు రోహిత్‌ మునుపటిలా లేడు.. ఈసారి కచ్చితంగా: మంజ్రేకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement