ప్రపంచ క్రికెట్‌లో యాషెష్ తర్వాత అంత్యంత టెస్టు రైవలరీ ఏదైనా ఉందంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతీ రెండేళ్లకు ఓ సారి జరిగే ఈ రెడ్ బాల్ సమరానికి సమయం అసన్నమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగే ఈ పోటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. భారత జట్టు అయితే 12 రోజుల ముందుగానే ఆసీస్ గడ్డపై అగుడుపెట్టి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.
ఈ సిరీస్ భారత్ చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా ఈ టెస్టు సిరీస్‌ను 4-1 తప్పకగెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హిస్టరీపై ఓ లుక్కేద్దాం.
1996లో మొదలై..
భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు క్రికెట్ జర్నీ 1947లో మొదలైంది. లాలా అమర్‌నాథ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారిగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొట్టమొదటి సిరీస్‌ను కంగారులు 4-0 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1947 నుండి 1992 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి.
అయితే 1996లో భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ సారథి అలన్ బోర్డర్‌ల గౌరవర్ధం ఓ సిరీస్ నిర్వహించాలని భావించాయి.
దీంతో ఆసీస్-భారత్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’గా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నామకరణం చేశాయి. అప్పటి నుంచి ఈ ట్రోఫీ విజయవంతంగా సాగుతోంది. కాగా గావస్కర్, అలెన్ బోర్డర్ వరల్డ్ టెస్టు క్రికెట్‌లో తమదైన ముద్ర వేసుకున్నారు. వీరిద్దరూ టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్లకు ఎన్నో అద్బుత విజయాలు అందించారు.
మనదే పైచేయి..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతోంది. ఈ ట్రోఫీ కింద ఇప్పటివరకు మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. అందులో టీమిండియా 10 సార్లు విజేతగా నిలవగా.. ఆసీస్ ఐదు సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2003–04 సిరీస్ మాత్రమే డ్రా అయింది. ఓవరాల్‌గా 1996 నుంచి ఇరు జట్ల మధ్య 57 టెస్టుల్లో జరిగాయి. అందులో టీమిండియా 24, ఆస్ట్రేలియా 21 విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర..
2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. 71 ఏళ్లగా ఆసీస్ గడ్డపై ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.
ఆ తర్వాత 2021-22లో పర్యటనలో కూడా సత్తాచాటిన భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment