
న్యూఢిల్లీ: బ్రేక్ డ్యాన్స్ అంటే తెలుగువారికి ఠక్కున గుర్తొచ్చేవి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. చిత్రగీతాల్లో బ్రేక్ డ్యాన్స్‌ను ఎప్పుడో చూశాం. ఈ డ్యాన్స్‌తోనే చిరంజీవి తెలుగు చిత్రసీమను ఏలారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం చిరంజీవి పాత పాటల్ని, సినీ పాటల్ని చూడాల్సిన అవసరం లేదు. ఆసియా క్రీడలను చూసినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఆటలపోటీ అయింది. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమివ్వనున్న 2022 ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా ఖరారు చేస్తూ ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఈ–స్పోర్ట్స్ (ఎల్రక్టానిక్ క్రీడలు) కూడా మెడల్ ఈవెంట్‌గా మారింది. ఈ–స్పోర్ట్స్ ఆసియా క్రీడలకు కొత్తకాదు. 2007 మకావులో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో తొలిసారిగా మెడల్ ఈవెంట్‌గా ఆడించారు. గత ఆసియా క్రీడల్లో (ఇండోనేసియా) కూడా ఈ–స్పోర్ట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ పతకాల పట్టికలో వాటిని పరిగణించలేదు. తాజా నిర్ణయంతో ఆసియా క్రీడలకు కొత్త ఈవెంట్లు మరింత వన్నె తీసుకొస్తాయని ఆశిస్తున్నట్లు ఓసీఏ డైరెక్టర్ హైదర్ ఫర్మాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment