మన్కడింగ్‌ను నిషేధించడంతో పాటు క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం, బంతికి లాలాజలాన్ని పూయడం వంటి పలు క్రికెట్ చట్టాలను మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే సవరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై దిగ్గజ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఎంసీసీ నిబంధనలను స్వాగతించగా, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఎంసీసీ కొత్త నిబంధనలపై విమర్శలు గుప్పించాడు.
మన్కడింగ్‌ను నిషేదించడంపై లారా స్పందిస్తూ.. బౌలర్ బంతి విసిరే క్రమంలో నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్ పరుగు కోసం క్రీజ్‌ను వదలడం సహజమేనని, అలాంటి తరుణంలో బౌలర్ బెయిల్స్‌ను పడగొట్టి ఔట్‌కు అప్పీల్ చేయడం (ఈ తరహా రనౌట్ అప్పీల్‌ను మన్కడింగ్ అంటారు) క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఎంసీసీ తాజాగా ఇలాంటి అప్పీల్స్‌కు చట్టబద్దత కల్పిస్తూ రనౌట్‌గా పరిగణించడం ఎంత మాత్రం సబబు కాదని మండిపడ్డాడు. లారాకు ముందు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా ఎంసీసీ నూతన నిబంధనలపై ధ్వజమెత్తాడు.
క్యాచ్ అవుట్ అయినప్పుడు కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌కు రావడం అనే రూల్‌పై నీషమ్ స్పందిస్తూ.. ఎంసీసీ ఈ అనవసర నిబంధన ఎందుకు అమల్లోకి తేవాలనుకుంటుందో అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మన్కడింగ్‌ను నిషేదిస్తూ ఎంసీసీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెటర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ పేరుతో ఈ తరహా రనౌట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసీసీ మన్కడ్ పేరుతో చలామణి అవుతున్న మన్కడింగ్ పదాన్ని నిషేధించి, ఆ తరహా ఔట్‌ను సాధారణ రనౌట్‌గా పరిగణించాలని నిర్ణయించింది.
చదవండి: కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు
Comments
Please login to add a commentAdd a comment