అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ (PC: ICC)
ICC ODI WC 2023 Eng Vs Afg: వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అనుకున్న రీతిలో రాణించలేకపోతోంది. ఆరంభ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన బట్లర్ బృందం.. తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి గాడిలో పడ్డట్లు కనిపించింది.
కానీ.. మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి కథ తలకిందులైంది. తమ వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ ముందు తలవంచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా సమిష్టి వైఫల్యంతో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ టీమిండియా, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న వేళ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు ఓడి పరాభవం మూటగట్టుకుంది.
అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది
కాగా ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ 2019 వరల్డ్‌కప్ హీరో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు.
వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే
‘‘బెన్ స్టోక్స్ 99 శాతం ఫిట్‌గా ఉన్నా సరే అతడిని తుదిజట్టులోకి తీసుకోండి. మీకు అతడి అవసరం ఎంతగానో ఉంది. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే కదా వెనక్కి పిలిపించారు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తదుపరి మ్యాచ్ ఓడిపోతే.. తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. గతంలో జరిగినట్లే ప్రతిసారి జరుగుతుందని అనుకోవడం పొరపాటే అవుతుంది’’ అని పఠాన్ పేర్కొన్నాడు.
ప్రతిసారీ అలాగే జరుగదు
అదే విధంగా... ‘‘2019 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్‌తో పాటు మరో జట్టుతో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.
అయితే, ప్రతిసారి ఇలాగే జరగదు కదా!’’ అంటూ ఇంగ్లండ్ తమ లోపాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఇర్ఫాన్ పఠాన్ నొక్కివక్కాణించాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీ ఆడాలన్న మేనేజ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు ఆల్‌రౌండర్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే, గాయం కారణంగా అతడు తొలి మూడు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండలేకపోయాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్ ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు.
చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment