టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది జూన్ నెలకు గానూ అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం సంతోషంగా ఉంది. అమెరికా- వెస్టిండీస్‌లో గడిపిన సమయం నాకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చింది.
ఇప్పుడిలా ప్రత్యేక గౌరవం కూడా దక్కింది. జట్టుగా మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో వ్యక్తిగతంగానూ నా ఖాతాలో ఈ విజయం చేరడం మరింత ఆనందంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. టీ20 ప్రపంచకప్ గెలవడం తన జీవితంలో మరచిపోలేని క్షణం అంటూ బుమ్రా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా జూన్‌లో ముగిసిన ఈ మెగా టోర్నీలో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.
బ్యాటర్లకు వణుకు పుట్టించి
ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 4.17 ఎకానమీ రేటుతో పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో అఫ్గనిస్తాన్ పేసర్ ఫజల్‌హక్ ఫారుకీ(17), టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(17) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా ప్రత్యర్థి జట్లలోని బ్యాటర్లకు వణుకు పుట్టించి కీలక వికెట్లు తీసి బుమ్రా సత్తా చాటాడు. తద్వారా టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
తాజాగా ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సాధించాడు. కాగా ఓట్ల ద్వారా విజేతను నిర్ణయించే ఈ విభాగంలో బుమ్రాతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అఫ్గన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ పోటీపడ్డారు. అయితే, వీరిద్దరి కంటే ఎక్కువ ఓట్లు సాధించిన బుమ్రా జూన్ నెల విజేతగా నిలిచాడు. అభిమానుల వల్లే ఇది సాధ్యమైందంటూ కృతజ్ఞత చాటుకున్నాడు.
స్మృతి మంధానకు పట్టం
అదే విధంగా మహిళా విభాగంలో భారత క్రికెటర్ స్మృతి మంధానకు ఈ అవార్డు దక్కింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అదరగొట్టినందుకు స్టార్ బ్యాటర్‌ను ఈ అవార్డు వరించింది.
సరికొత్త చరిత్ర
కాగా ఐసీసీప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా క్రికెటర్లు ఒకే నెలలో విజేతలుగా నిలవడం ఇదే తొలిసారి. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment