సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఇప్పటికే సౌతాఫ్రికా సిరీస్‌ను చేజెక్కించుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 59 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలాన్‌లు శతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోరు చేసింది.
బట్లర్(127 బంతుల్లో 131, ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ మలాన్(114 బంతుల్లో 118, ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మొయిన్ అలీ 23 బంతుల్లో 41 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రీజా హెండ్రిక్స్ 52, టెంబా బవుమా 35 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఆరు వికెట్లతో టాప్ లేపగా.. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు.
ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును జాస్ బట్లర్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌తో ఏదైనా లాభపడిందంటే అది ఆర్చర్ రూపంలో మాత్రమే. గాయంతో చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే తన విలువేంటో మూడో వన్డేలో చూపించాడు. ఆరు వికెట్లతో ప్రొటిస్ నడ్డి విరిచాడు. కీలకమైన వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment