
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో సారి టాప్–5లోకి అడుగు పెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఐదో స్థానంలో నిలిచింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె టాప్–5లోకి వెళ్లడం విశేషం. కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయం కారణంగా సింధు ఆటకు దూరమైంది.
అయితే గాయంనుంచి కోలుకున్న ఆమె సోమవారమే హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సైనా నెహ్వాల్ ఒక స్థానం దిగజారి 33వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 8, 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ కూడా తమ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment