World Badminton Federation
-
ఐదో ర్యాంక్‌కు సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరో సారి టాప్–5లోకి అడుగు పెట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు ఐదో స్థానంలో నిలిచింది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె టాప్–5లోకి వెళ్లడం విశేషం. కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయం కారణంగా సింధు ఆటకు దూరమైంది. అయితే గాయంనుంచి కోలుకున్న ఆమె సోమవారమే హైదరాబాద్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. సైనా నెహ్వాల్ ఒక స్థానం దిగజారి 33వ ర్యాంక్‌కు పడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ వరుసగా 8, 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ కూడా తమ 8వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. -
అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో సింధు
భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి. సింధు 2017నుంచి అథ్లెటిక్స్ కమిషన్‌లో కొనసాగుతుండగా... రెండో సారి ఆమె మాత్రమే పోటీ పడుతోంది. ఇందులో అందుబాటులో ఉన్న ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు. -
ప్రకాశ్ పడుకోన్‌కు అరుదైన గౌరవం
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సముచిత రీతిలో గౌరవిస్తూ ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన మాజీ వరల్డ్ నంబర్‌వన్ ప్రకాశ్ పడుకోన్ ఆ తర్వాత 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ఓజీక్యూ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. -
విశ్వవిజేతలు కూడా ఆడి అర్హత సాధించాల్సిందే!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ‘ప్రపంచ చాంపియన్స్’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ‘కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం. వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు... ‘ఆసియా’ టోర్నీల్లో సత్తా చాటి ‘ఫైనల్స్’కు అర్హత సాధించాల్సి ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సింధు ఆసియా లెగ్–1, 2 టోర్నీల్లో రాణించి ‘ఫైనల్స్’కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. ‘సింధు ప్రపంచ చాంపియన్, గతంలో ‘ఫైనల్స్’ టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా సవరించిన∙షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జనవరి 27–31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. జనవరి 12–17 మధ్య ఆసియా ఓపెన్–1, జనవరి 19–24 మధ్య ఆసియా ఓపెన్–2 ఈవెంట్లు జరుగుతాయి. -
మరో నాలుగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
టోక్యో: కరోనా ఖాతాలో మరో నాలుగు టోర్నీలు చేరాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం తాజాగా ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తైపీ ఓపెన్ (సెప్టెంబర్ 1–6), కొరియా ఓపెన్ (8–13), చైనా ఓపెన్ (15–20), జపాన్ ఓపెన్ (22–27)లను నిర్వహించబోమని సమాఖ్య వెల్లడించింది. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అందరి ఆరోగ్యభద్రత దృష్ట్యా టోర్నీల రద్దుకే మొగ్గుచూపామని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి థామస్ లుండ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగానే ఇటీవల చైనాలో జరగాల్సిన 11 టెన్నిస్ టోర్నీలు రద్దు కాగా... మంగళవారం ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీఏ పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ తొలిసారిగా రద్దయింది. -
‘ఐ యామ్ బ్యాడ్మింటన్’ అంబాసిడర్‌గా సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’కు వరల్డ్ చాంపియన్, హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం వేదికగా నిలువనుంది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ‘ఏ క్రీడలోనైనా నిజాయితీగా ఆడటమనేది చాలా ముఖ్యం. నీ ఇçష్టప్రకారమే నువ్వు ఆటను ఎంచుకున్నావు. దాన్ని ఆడటంలో నువ్వు అమితమైన ఆనందాన్ని పొందాలి. ఆటలో నిజాయితీగా ఉండాలి. అదే నాకు ముఖ్యం. అంబాసిడర్లుగా ఈ విషయాన్ని మేం మరింత బాగా ఆటగాళ్లలోకి తీసుకెళ్లాలి. ఇలా అయితేనే ఈ విషయం ఎక్కువ మంది ఆటగాళ్లకు చేరుతుంది’ అని 24 ఏళ్ల సింధు పేర్కొంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్ సీ వీయ్, హంగ్ యా కియాంగ్ (చైనా), జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వలెస్కా ఖోబ్‌లాచ్ (జర్మనీ), చాన్ హో యున్ (హాంకాంగ్), మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్, బీడబ్ల్యూఎఫ్ పారాలింపిక్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ రిచర్డ్ పెరోట్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్ అక్సెల్సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. -
తొలి ‘సూపర్’ టైటిల్ వేటలో...
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం ఊరిస్తోంది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు నేటి నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలతోపాటు డబుల్స్ విభాగాల మ్యాచ్‌లు ఉన్నాయి. మెయిన్ ‘డ్రా’ సింగిల్స్ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి. తొలి రౌండ్లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీవెన్ జాంగ్‌పై అలవోకగా నెగ్గిన సింధు మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడే చాన్స్ ఉంది. చైనా ఓపెన్‌లో చోచువోంగ్ చేతిలోనే సింధు ఓడింది. ఈ ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మినహాయిస్తే సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో స్థానిక క్రీడాకారిణి కిమ్ గా యున్‌తో ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో సైనాకు మూడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)... సింధుకు నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్.. క్వాలిఫయర్‌తో కశ్యప్ తలపడనున్నారు. -
బ్యాడ్మింటన్ ఆడొచ్చు... ఎక్కడైనా!
గ్వాంగ్జౌ: ఇకపై బ్యాడ్మింటన్ ఆటను బీచ్‌లలోనూ చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు. అంటే ఇండోర్ కోర్టులకే పరిమితమైన బ్యాడ్మింటన్ పోటీలు త్వరలో బహిరంగ ప్రదేశాల్లోనూ జరుగుతాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అధికారికంగా కొత్త ఔట్‌డోర్ బ్యాడ్మింటన్ ఆట ‘ఎయిర్ బ్యాడ్మింటన్’ను లాంఛనంగా ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకించి ఎయిర్ షటిల్ కాక్‌లను తయారు చేయించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారమిక్కడ జరిగింది. ఈ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయెర్ మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ఆటకు ఇది మరుపురాని రోజు. ఎయిర్ బ్యాడ్మింటన్‌తో మన పరిమితులు, హద్దులు చెరిగిపోతాయి. బ్యాడ్మింటన్ రాకెట్‌ను ప్రొఫెషనల్ ఆటగాళ్ల చేతిలోనే కాదు ఇకపై ఎవరి చేతుల్లోనైనా చూడొచ్చు. ఎక్కడైనా ఆడొచ్చు’ అని అన్నారు. ఈ ఎయిర్ బ్యాడ్మింటన్‌ను ప్రత్యేకించి వీళ్లే ఆడాలని లేదు. ఇక్కడే ఆడాలనే నియమం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ఎంచక్కా ఆడుకునేలా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆట రూపొందింది. హార్డ్కోర్ట్, గ్రాస్‌కోర్ట్, పార్క్‌ల్లోని ఇసుకపై, గార్డెన్, వీధులు, ప్లేగ్రౌండ్స్, బీచ్‌లు అంతటా ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడొచ్చని బీడబ్ల్యూఎఫ్ అధికారికంగా వెల్లడించింది. బయటి వాతావరణానికి అనుగుణంగా ఎయిర్ బ్యాడ్మింటన్ ఆటను అభివృద్ధి చేసినట్లు ఎరిక్ హొయెర్ తెలిపారు. ప్రత్యేకమైన రాకెట్, షటిల్ కాక్‌లు బలమైన గాలుల్ని తట్టుకునేలా తయారు చేశారు. -
ఈసారి టైటిల్ గెలుస్తా: సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఈసారి టైటిల్ సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పింది. వచ్చే నెల 12 నుంచి గ్వాంగ్జౌ (చైనా)లో జరిగే ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు గతవారం సయ్యద్ మోదీ ఈవెంట్‌కు ఆమె గైర్హాజరయింది. ‘ఈసారి తప్పకుండా మెరుగైన ఫలితం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నా. హేమాహేమీలు తలపడే ఈ ఈవెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రత్యర్థులంతా క్లిష్టమైన వారే. ఎవరికి ఎవరూ తీసిపోరు. కానీ నేను మాత్రం ఈసారి టైటిల్ చేజార్చుకోను’ అని సింధు తెలిపింది. -
సింధు, శ్రీకాంత్ నిష్క్రమణ
చాంగ్జౌ: ఈ ఏడాది భారత అగ్రశ్రేణి క్రీడాకారులకు మరో ‘సూపర్’ టోర్నమెంట్ నిరాశను మిగిల్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ సూపర్–1000 చైనా ఓపెన్‌లో భారత్ కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్ బరిలో నిలిచిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఆ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు 11–21, 21–11, 15–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా) చేతిలో పోరాడి ఓడగా... పురుషుల సింగిల్స్ విభాగం మ్యాచ్‌లో శ్రీకాంత్ 9–21, 11–21తో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో నిష్క్రమించిన సింధు, శ్రీకాంత్‌లకు 5,500 డాలర్ల చొప్పున (రూ. 3 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన శ్రీకాంత్ ఈ ఏడాది అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కెంటో మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కేవలం 28 నిమిషాల్లోనే చేతులెత్తేశాడు. శ్రీకాంత్ తొలి గేమ్‌లో ఓసారి వరుసగా ఎనిమిది పాయింట్లు... రెండో గేమ్‌లో ఓసారి వరుసగా తొమ్మిది పాయింట్లు కోల్పోవడం గమనార్హం. ఓవరాల్‌గా మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది ఎనిమిదో పరాజయంకాగా వరుసగా ఐదో ఓటమి. గతంలో చెన్ యుఫెపై నాలుగుసార్లు గెలిచిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో సింధు తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 14–12 వద్ద చెన్ యుఫె వరుసగా నాలుగు పాయింట్లు స్కోరు చేసి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
సాత్విక్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో భారత్‌కు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–14తో మూడో సీడ్ అక్బర్–ఇస్ఫహాని (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. మిక్స్డ్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కిరెడ్డి–ప్రణవ్ (భారత్) ద్వయం 21–15, 19–21, 23–25తో ఆరో సీడ్ అక్బర్–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కిరెడ్డి ద్వయం 3 మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సమీర్ వర్మ 21–15, 21–18తో సూంగ్ జూ వెన్ (మలేసియా)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. -
సాయిప్రణీత్‌కు షాక్...
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో రెండో సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ భమిడిపాటి సాయి ప్రణీత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 169వ ర్యాంకర్ చికో ద్వి వార్దోయో (ఇండోనేసియా) 13–21, 22–20, 21–12తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న సాయి ప్రణీత్ హోరాహోరీగా సాగిన రెండో గేమ్ లో ప్రత్యర్థికి తలవంచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వార్దోయో చెలరేగడంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, గురుసాయిదత్ విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరా రు. సమీర్‌వర్మ 21–16, 21–16తో అరింతాప్ దాస్ గుప్తాపై, సౌరభ్ వర్మ 21–12, 22–20తో లీ యున్ గుయ్ (కొరియా)పై, గురుసాయిదత్ 21–11, 21–14తో మూడో సీడ్ మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయెల్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. యువ సంచలనం లక్ష్యసేన్ రెండో రౌండ్లో 13–21, 12–21తో హియో వాంగ్ హీ (కొరియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రసిక రాజె 21–19, 21–15తో అలెస్సాండ్రా మైనాకీ (ఇండోనేసియా)పై, ఆకర్షి కశ్యప్ 21–14, 23–21తో ముగ్దపై, శ్రీ కృష్ణ ప్రియ 12–21, 21–16, 21–14తో సిమ్రన్ సింఘిపై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఉత్తేజిత రావు 7–21, 21–12, 18–21తో దినార్ అయుస్టైన్ (ఇండోనేసియా) చేతిలో, రితూపర్ణదాస్ 13–21, 11–21తో యో మిన్ (ఇండోనేసియా) చేతిలో, వైదేహి 13–21, 14–21తో హర్త్‌వాన్ (ఇండోనేసియా) చేతిలో, ప్రభు దేశాయ్ 12–21, 14–21తో యూ జిన్ (కొరియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. -
నాలుగో ర్యాంకుకు సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడం సింధు ర్యాంకుపై ప్రభావం చూపింది. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఓ స్థానం దిగజారి తొమ్మిది ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (13వ ర్యాంకు), బీ సాయిప్రణీత్ (22), కిడాంబి శ్రీకాంత్ (26), సమీర్ వర్మ (27), హెచ్ఎస్ ప్రణయ్ (30వ ర్యాంకులో) నిలిచారు. -
ఆదిత్య... అదుర్స్
భోపాల్: కొత్త ఏడాది భారత బ్యాడ్మింటన్‌కు శుభవార్త మోసుకొచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల ఆదిత్య జోషి ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. తద్వారా జూనియర్ పురుషుల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ధార్ పట్టణానికి చెందిన ఆదిత్య గత నవంబరు వరకు 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన టాటా ఓపెన్ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టి క్వార్టర్ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. తన ఖాతాలో రెండు వేల ర్యాంకింగ్ పాయింట్లు జమచేసుకున్నాడు. ఆ తర్వాత జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గి తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. 2001లో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన ఆదిత్య పలు స్థానిక టోర్నమెంట్లలో తనకంటే ఎక్కువ వయస్సున్న విభాగాల్లో పోటీపడి విజేతగా నిలిచి అందరిదృష్టిని ఆకర్షించాడు. ఆదిత్య ఘనతపై అతని కోచ్ అమిత్ కులకర్ణి సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది రెండు అంతర్జాతీయ టోర్నీల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన ఆదిత్య ఈ ఏడాది జరిగే యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తేవాలని అతని తండ్రి అతుల్ జోషి ఆకాంక్షించారు. ‘ఆదిత్య బాల్యంలో కార్టూన్స్ చూస్తూ టీవీకే అతుక్కుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్ కూడా పెట్టించుకోలేదు’ అని అతని తల్లి హేమలత జోషి తెలిపింది.