సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్‌లో రెండో సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ భమిడిపాటి సాయి ప్రణీత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 169వ ర్యాంకర్ చికో ద్వి వార్దోయో (ఇండోనేసియా) 13–21, 22–20, 21–12తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. తొలి గేమ్‌ను గెలుచుకున్న సాయి ప్రణీత్ హోరాహోరీగా సాగిన రెండో గేమ్ లో ప్రత్యర్థికి తలవంచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో వార్దోయో చెలరేగడంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, గురుసాయిదత్ విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరా రు.
సమీర్‌వర్మ 21–16, 21–16తో అరింతాప్ దాస్ గుప్తాపై, సౌరభ్ వర్మ 21–12, 22–20తో లీ యున్ గుయ్ (కొరియా)పై, గురుసాయిదత్ 21–11, 21–14తో మూడో సీడ్ మిషా జిల్‌బెర్మాన్ (ఇజ్రాయెల్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. యువ సంచలనం లక్ష్యసేన్ రెండో రౌండ్‌లో 13–21, 12–21తో హియో వాంగ్ హీ (కొరియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రసిక రాజె 21–19, 21–15తో అలెస్సాండ్రా మైనాకీ (ఇండోనేసియా)పై, ఆకర్షి కశ్యప్ 21–14, 23–21తో ముగ్దపై, శ్రీ కృష్ణ ప్రియ 12–21, 21–16, 21–14తో సిమ్రన్ సింఘిపై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. ఉత్తేజిత రావు 7–21, 21–12, 18–21తో దినార్ అయుస్టైన్ (ఇండోనేసియా) చేతిలో, రితూపర్ణదాస్ 13–21, 11–21తో యో మిన్ (ఇండోనేసియా) చేతిలో, వైదేహి 13–21, 14–21తో హర్త్‌వాన్ (ఇండోనేసియా) చేతిలో, ప్రభు దేశాయ్ 12–21, 14–21తో యూ జిన్ (కొరియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment