
ఇంచియోన్ (దక్షిణ కొరియా): ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ టైటిల్ మాత్రం ఊరిస్తోంది. గతవారం చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిన సింధు నేటి నుంచి మొదలయ్యే కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం క్వాలిఫయింగ్ పోటీలతోపాటు డబుల్స్ విభాగాల మ్యాచ్‌లు ఉన్నాయి. మెయిన్ ‘డ్రా’ సింగిల్స్ మ్యాచ్‌లు బుధవారం మొదలవుతాయి.
తొలి రౌండ్‌లో చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీవెన్ జాంగ్‌పై అలవోకగా నెగ్గిన సింధు మరోసారి అలాంటి ఫలితమే పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడే చాన్స్ ఉంది. చైనా ఓపెన్‌లో చోచువోంగ్ చేతిలోనే సింధు ఓడింది. ఈ ఏడాదిలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మినహాయిస్తే సింధు ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది.
భారత్‌కే చెందిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి కిమ్ గా యున్‌తో ఆడుతుంది. ‘డ్రా’ ప్రకారం క్వార్టర్ ఫైనల్లో సైనాకు మూడో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)... సింధుకు నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్.. క్వాలిఫయర్‌తో కశ్యప్ తలపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment