
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఈసారి టైటిల్ సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పింది.
వచ్చే నెల 12 నుంచి గ్వాంగ్‌జౌ (చైనా)లో జరిగే ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు గతవారం సయ్యద్ మోదీ ఈవెంట్‌కు ఆమె గైర్హాజరయింది. ‘ఈసారి తప్పకుండా మెరుగైన ఫలితం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నా. హేమాహేమీలు తలపడే ఈ ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రత్యర్థులంతా క్లిష్టమైన వారే. ఎవరికి ఎవరూ తీసిపోరు. కానీ నేను మాత్రం ఈసారి టైటిల్ చేజార్చుకోను’ అని సింధు తెలిపింది.