బాలి (ఇండోనేసియా): రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు 21–10, 21–13తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయాన్ని సాధించింది. దాంతో గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ టాపర్‌ని తేల్చే నేటి మ్యాచ్‌లో పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్ ‘ఎ’ నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత షట్లర్ లక్ష్యసేన్‌కు విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి ఎదురైంది. గ్రూప్ విజేతను తేల్చే మ్యాచ్‌లో లక్ష్యసేన్ 15–21, 14–21తో అక్సెల్‌సన్ చేతిలో ఓడాడు. గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతున్న మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ (భారత్) తన రెండో మ్యాచ్‌లో 18–21, 7–21తో కున్లావుట్ విదిత్ సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయంపాలైయ్యాడు. శ్రీకాంత్ సెమీస్ చేరాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో లీ జి జియా (మలేసియా)పై తప్పక నెగ్గాలి.
గాయంతో సాత్విక్–చిరాగ్ జంట అవుట్
టోర్నీ నుంచి భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తప్పుకుంది. సాత్విక్ సాయిరాజ్ మోకాలి గాయంతో బాధ పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తన ప్రకటన ద్వారా తెలిపింది. పురుషుల డబుల్స్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత జంట... గురువారం మార్కస్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో ఆడాల్సి ఉంది. అయితే సాత్విక్ గాయం కారణంగా ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చి టోర్నీ నుంచి తప్పుకుంది. మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. ‘గ్రూప్ బి’లో జరిగిన పోరులో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి ద్వయం 19–21, 20–21తో గ్యాబ్యియెలా–స్టెపాని (బల్గేరియా) జోడీ చేతిలో ఓడింది. దాంతో గ్రూప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి జోడీ జంట టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment