
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ‘ప్రపంచ చాంపియన్స్’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ‘కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం.
వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు... ‘ఆసియా’ టోర్నీల్లో సత్తా చాటి ‘ఫైనల్స్’కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సింధు ఆసియా లెగ్–1, 2 టోర్నీల్లో రాణించి ‘ఫైనల్స్’కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. ‘సింధు ప్రపంచ చాంపియన్, గతంలో ‘ఫైనల్స్’ టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా సవరించిన∙షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జనవరి 27–31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. జనవరి 12–17 మధ్య ఆసియా ఓపెన్–1, జనవరి 19–24 మధ్య ఆసియా ఓపెన్–2 ఈవెంట్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment