టీమిండియాకు శుభవార్త! నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తే సరిపోదు: మాజీ క్రికెటర్‌ కౌంటర్ | Cant Bat In Nets Return To International Cricket Ex India Star Picks KL Rahul Replacement | Sakshi
Sakshi News home page

KL Rahul: టీమిండియాకు శుభవార్త! నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తే సరిపోదు: మాజీ క్రికెటర్‌ కౌంటర్

Jun 29 2023 9:27 PM | Updated on Jun 29 2023 9:42 PM

Cant Bat In Nets Return To International Cricket Ex India Star Picks KL Rahul Replacement - Sakshi

కేఎల్‌ రాహుల్‌

KL Rahul Replacemnet?: టీమిండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2023లో ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా ఈ లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథి గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదహారో ఎడిషన్‌కు దూరం కావడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కూడా ఆడలేకపోయాడు.

గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఈ కర్ణాటక బ్యాటర్‌ వెస్టిండీస్‌ పర్యటనకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి.. మరోవారం రోజుల్లో ప్రాక్టీసు మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

టీమిండియాకు శుభవార్త అంటూ ట్వీట్‌
ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్‌-2023 ఈవెంట్‌కి అతడు అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రాహుల్‌ పునరాగమనానికి సంబంధించిన వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. క్రికెట్‌ అప్‌డేట్లు పంచుకునే ఓ ట్విటర్‌ యూజర్‌.. ‘‘టీమిండియాకు శుభవార్త.

కేఎల్‌ రాహుల్‌ మరో రెండు వారాల్లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నాడు’’ అంటూ కేఎల్‌ ఫొటో షేర్‌ చేశాడు. ఇందుకు స్పందించిన మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌.. జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ అంత సులభం కాదంటూ కౌంటర్‌ వేశాడు.

అంత ఈజీ కాదు
‘‘బ్యాటింగ్‌లో తిరిగి ఫామ్‌లోకి రావడానికి, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌ ఆడాలి. జాతీయ జట్టులో పునరాగమనం మరీ అంత సులువుగా ఉండదు. ఉండకూడదు! 

నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సై అనడం ఎంతవరకు కరెక్ట్‌. కాబట్టి ముందుగా రాహుల్‌కు ప్రత్యామ్నాయం వెదకాలి. సాయి సుదర్శన్‌ వంటి లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ను మిడిలార్డర్‌లో ఆడించే ప్రయత్నం చేయాలి’’ అని తమిళనాడుకు చెందిన ఈ మాజీ స్పిన్నర్‌ అభిప్రాయపడ్డాడు.

బ్యాటర్లు పరుగులు తీయాలి.. బౌలర్లు వికెట్లు పడగొట్టాలి
ఇందుకు బదులుగా ఓ నెటిజన్‌.. ‘‘సాయి బంతితో కూడా జట్టుకు ఉపయోగపడగలడు’’ అని వ్యాఖ్యానించగా.. శివరామకృష్ణన్‌.. ‘‘బ్యాటర్లు పరుగులు సాధించడానికి, బౌలర్లు వికెట్లు తీయడానికి ఉంటారు. జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రమే పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ గురించి ఆలోచించాలి’’ అని సమాధానమిచ్చాడు.

కాగా మద్రాస్‌లో జన్మించిన శివరామకృష్ణన్‌ టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 26, 15 వికెట్లు పడగొట్టాడు. కొన్నాళ్లపాటు కామెంటేటర్‌గా వ్యవహరించిన అతడు.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ఆటగాడు జథావేదఘ్‌ సుబ్రమణియన్‌ కోచ్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్‌ రాహుల్‌ సహా జస్‌ప్రీత్‌ బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ తదితర కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం విదితమే.

చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్‌ ఆడగానే! జడ్డూ..: గంగూలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement