ఆర్సీబీ వైఫల్యాలపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు (PC: BCCI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.
జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అదే ఇక్కడ ప్రధాన సమస్య
‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు.
అలాంటపుడు ఆ విదేశీ కోచ్‌లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్‌లకు ఎలా వివరించగలరు?
నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి.
కెప్టెన్‌గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు?
నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు.
కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్‌గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్‌గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు.
చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment