Suresh Raina Retirement: మిస్టర్ ఐపీఎల్, చిన్న తలా సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై అతని తాజా మాజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్పందించింది. చరిత్ర మరువని విజయాలు సాధించినప్పుడు తమతో ఉన్నవాడు, ఆ విజయాలు సాధించేందుకు తోడ్పడిన వాడు చిన్న తలా..! థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ రైనా ఫోటోను పోస్ట్ చేసి ట్విటర్‌లో భావోద్వేగ సందేశం పంపింది. సీఎస్‌కే సందేశంలో రైనాపై వారికున్న ఆప్యాయత స్పష్టంగా కనబడింది. ఆఖరి సీజన్‌లో వారు రైనాను కాదనుకున్నప్పటికీ అతనిపై ఇంత గౌరవం ఉండటాన్ని రైనా అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఎల్లో ఆర్మీతో, ఐపీఎల్‌తో బంధాన్ని తెంచుకోవడాన్ని చిన్న తలా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
The one who was there when glory was etched in history! The one who made it happen!
— Chennai Super Kings (@ChennaiIPL) September 6, 2022
Thank You for everything, Chinna Thala! 💛#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/9Olro0z0Bn
కాగా, రైనాకు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవమున్నా, ఐపీఎల్‌తోనే గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. రైనాకు చెన్నై జట్టుతో ఏర్పడిన విడదీయలేని బంధం అతన్ని మిస్టర్ ఐపీఎల్‌గా నిలబెట్టింది. 2020, 2022 సీజన్లు మినహాయించి రైనా ప్రతి ఐపీఎల్‌లో ఆడాడు. 2016, 17 సీజన్‌లలో సీఎస్‌కేపై నిషేధం ఉండటంతో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను.. 11 సీజన్ల పాటు ఎల్లో ఆర్మీలో కొనసాగాడు. చెన్నై టైటిల్ గెలిచిన నాలుగు సార్లూ రైనా జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా సెంచరీ, 39 అర్ధసెంచరీల సాయంతో 5528 పరుగులు సాధించాడు.
వయసు పైబడటంతో పాటు ఫామ్‌లో లేకపోవడంతో సీఎస్‌కే యాజమాన్యం రైనాను 2022 సీజన్‌కు ముందు రీటైన్ చేసుకోలేదు. ఇదే కారణం చేత ఆ తర్వాత జరిగిన మెగా వేలంలోనే కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ వీడాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ (సెప్టెంబర్ 6) భారత క్రికెట్‌తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రైనా తీసుకున్న నిర్ణయంతో అతను ఐపీఎల్‌తో పాటు బీసీసీఐతో అనుబంధం ఉన్న ఏ ఇతర టోర్నీల్లోనూ పాల్గొన్నలేడు. వాస్తవానికి రైనా రెండేళ్ల క్రితమే ధోనీతో కలిసి ఒకే సారి (ఆగస్ట్ 15) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment