ఐపీఎల్-2024 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే దూరమైన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే పడింది. శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్‌తో కాన్వే స్ధానాన్ని సీఎస్‌కే భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అతడితో సీఎస్‌కే ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.50లక్షల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్‌కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్దమైంది.
మెండీస్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో మెండీస్ దుమ్ములేపుతున్నాడు. మెండిస్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఛటోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సైతం మెండిస్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అంతకుముందు బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ మెండిస్ అదరగొట్టాడు. అదేవిధంగా మెండిస్ వికెట్ కీపర్ బ్యాటర్ అయినందున తమ జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే ఫిక్స్ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment