‘ఒలింపిక్‌ సవాల్‌కు సిద్ధం’  | Chief coach Gopichand is happy with the performance of Asian Games 2023 | Sakshi
Sakshi News home page

‘ఒలింపిక్‌ సవాల్‌కు సిద్ధం’ 

Published Thu, Oct 12 2023 4:19 AM | Last Updated on Thu, Oct 12 2023 4:19 AM

Chief coach Gopichand is happy with the performance of Asian Games 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మేం వరుస విజయాలు  సాధిస్తున్నా చాలా మంది ప్రత్యర్థులు కొంత కాలం వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఆటపై అందరి దృష్టీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇకపై మా ఆటను విశ్లేషించి మాపై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు’... భారత డబుల్స్‌ బ్యాడ్మింటన్‌ స్టార్, వరల్డ్‌ నంబర్‌వన్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ చేసిన వ్యాఖ్య ఇది.

సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్‌లో స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. టీమ్‌ ఈవెంట్‌లో కూడా భారత పురుషుల జట్టు రజతం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కాంస్యం గెలిచాడు. ఈ నేపథ్యంలో బుధవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ఆటగాళ్లతో పాటు చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ పాల్గొన్నారు.  

వాళ్లని పడగొట్టగలిగాం... 
గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందామని, ఆ తర్వాత మరింత పట్టుదలగా సాధన చేసి ఆసియా క్రీడలకు వెళ్లినట్లు సాత్విక్‌ వెల్లడించాడు. చాలా కాలంగా తమకు కొరకరాని కొయ్యగా ఉన్న మలేసియా జోడీ సొ వుయి యిక్‌–ఆరోన్‌ చియాలను ఆసియా క్రీడల సెమీఫైనల్లో ఓడించడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతను అన్నాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం తాము అన్ని విధాలా సిద్ధమవుతామన్న సాత్విక్‌... అన్నింటికంటే ఫిట్‌నెస్‌ కీలకమని వ్యాఖ్యానించాడు.

‘ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు. మా శరీరమే మాకు ప్రత్యర్థి. రాబోయే రోజుల్లో గాయాలు లేకుండా పూర్తి ఫిట్‌గా ఉంటే చాలు. కోర్టులో ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌కు ముందు కొన్ని టోరీ్నలలో మేం ఓడినా పర్వాలేదు. అన్నింటిలోనూ గెలిస్తే అసలు సమయానికి సమస్య రావచ్చేమో’ అని సాత్విక్‌ అన్నాడు.  

ఇలాంటి అవకాశం రాదని... 
పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తీవ్ర గాయంతో బాధపడుతూనే ప్రణయ్‌ పతకం కోసం పోరాడాడు. చివరకు అతను విజయం సాధించినప్పుడు కోచ్‌ గోపీచంద్‌ సహా సహచరులంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే గాయం ఉన్నా ఆడేందుకు సిద్ధం కావడం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమని ప్రణయ్‌ చెప్పాడు. ‘నా శరీరం ఎంత వరకు సహకరించగలదో ఫిజియో కొన్ని సూచనలు ఇచ్చారు. దాని ప్రకారమే కోచ్‌ గోపీ సర్‌తో పాటు అందరితో చర్చించాక నేను ఆడేందుకు సిద్ధమయ్యా. నొప్పి ఉన్నా సరే పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆసియా క్రీడల్లో పతకం విలువేంటో తెలుసు.

గతంలో ఎన్నోసార్లు గాయాలతో బాధపడి కీలక సమయాల్లో అవకాశం కోల్పోయా. ఈ జీవితకాలపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని భావించా. అయితే గాయం తీవ్రత వల్లే టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ఆడలేదు’ అని ప్రణయ్‌ చెప్పాడు. నిజానికి తమ స్వర్ణంకంటే ప్రణయ్‌ కాంస్యం గెలుచుకోవడం తమకు ఎక్కువ ఆనందాన్నిచ్చిందని సాత్విక్‌ అన్నాడు. అతను పతకం కోసం ఎంత కష్టపడ్డాడో, కీలక సమయాల్లో వెనుకబడి పుంజుకునేందుకు ఎంత పోరాడాడో తమకు తెలుసు కాబట్టి అతను పతకం సాధించాని జట్టంతా కోరుకుందని సాత్విక్‌ వెల్లడించాడు.  


‘వారి వల్లే ఈ ఉత్సాహమంతా’
గోపీచంద్‌ భారత కోచ్‌గా మారి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక చాలనుకొని తప్పుకోవాలని చాలా సార్లు భావించానని, అయితే యువ ఆటగాళ్ల విజయాలు తనకు ప్రేరణ అందిస్తున్నాయని గోపీచంద్‌ చెప్పారు. సింగిల్స్, టీమ్‌ ఈవెంట్‌లలో పతకాలు రావడం ఎంతో ఆనందం కలిగించిందని గోపీచంద్‌ అన్నారు. ‘నా దృష్టిలో ఆసియా క్రీడల మెడల్‌ అంటే ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలతో సమానం. అందుకే ఈ ఆనందమంతా. జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. శ్రీకాంత్, లక్ష్య సేన్‌లకు ప్రత్యేక అభినందనలు.

ఇక ప్రణయ్‌ పతకం కోసం ప్రార్థించినంతగా నేను ఎప్పుడూ ప్రార్థించలేదు. ఈ ఒక్కసారి అతడిని గెలిపించమని దేవుడిని కోరుకున్నా. ఒలింపిక్స్‌కు ఇంకా సమయముంది. అయితే దానికి తగిన విధంగా సిద్ధమవుతాం’ అని గోపీచంద్‌ అన్నారు. అధికారికంగా ఇప్పుడు సాత్విక్‌–చిరాగ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్నా... గత ఏడాది కాలంగా వారి ఆటను చూస్తే అప్పటి నుంచే వారిని తాను నంబర్‌వన్‌గా భావించినట్లు ఆయన వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement