విండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిబ్రవరి 22 నుంచి భారత్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (International Masters League) అరంభ ఎడిషన్‌లో (2025) గేల్ విండీస్ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీలో గేల్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయా ఎన్తిని (Makhaya Ntini), ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) బరిలోకి దిగనున్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీలు, దిగ్గజాలు ఈ టోర్నీలో పాల్గొంటారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత్‌కు సచిన్ టెండూల్కర్, శ్రీలంకకు కుమార సంగక్కర, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియన్ మాస్టర్స్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు యువరాజ్ సింగ్ ఇటీవలే తన సమ్మతిని తెలిపాడు.
ఈ టోర్నీ మొత్తం మూడు వేదికల్లో నిర్వహించబడుతుంది. మొదటి ఐదు మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగనుండగా.. ఆతర్వాతి ఆరు మ్యాచ్‌లకు రాజ్‌కోట్ వేదిక కానుంది. చివరి ఏడు మ్యాచ్‌లతో పాటు నాకౌట్ మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో జరుగనున్నాయి.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఆరంభ ఎడిషన్ రౌండ్ రాబిన్ పద్దతిలో జరుగనుంది. ఈ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ దశ అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో ఉండే జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో విజేతలు మార్చి 16న రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
ఈ టోర్నీలోని మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. కలర్స్ సినీప్లెక్స్ (SD & HD), కలర్స్ సినీప్లెక్స్ సూపర్‌హిట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక.. భారత జట్టుతో తలపడుతుంది.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత జట్టు (అంచనా): సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శిఖర్ ధవన్, రాహుల్ శర్మ, నమన్ ఓఝా, స్టువర్ట్ బిన్నీ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారి, ప్రజ్ఞాన్ ఓఝా
Comments
Please login to add a commentAdd a comment