టీమిండియాకు సిరీస్‌ దూరం చేసి.. హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన కింగ్‌ | CPL 2023: Brandon King Leads Jamaica Tallawahs To Victory Vs St Kitts & Nevis Patriots - Sakshi
Sakshi News home page

టీమిండియాకు సిరీస్‌ దూరం చేసి.. హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన కింగ్‌

Published Thu, Aug 24 2023 3:20 PM | Last Updated on Thu, Aug 24 2023 3:29 PM

CPL 2023: King Leads Jamaica Tallawahs To Victory Vs St Kitts - Sakshi

విండీస్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ బ్రాండన్‌ కింగ్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ప్రారంభానికి ముందు టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఫామ్‌ను అందుకున్న కింగ్‌.. ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 85 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి, తన జట్టు సిరీస్‌ కైవసం (3-2) చేసుకునేలా చేశాడు. తాజాగా సీపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్న కింగ్‌ వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు చేసి (81, 67), ఇక్కడ కూడా తన జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. 

సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు సారధ్యం వహిస్తున్న కింగ్‌.. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియట్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 23) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి, తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌.. జాషువ డిసిల్వ (36), డోమినిక్‌ డ్రేక్స్‌ (29 నాటౌట్‌), ఆండ్రీ ఫ్లెచర్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

జాషువ, డ్రేక్స్‌, ఫ్లెచర్‌ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేకపోయారు. కెప్టెన్‌ ఎవిన్‌ లెవిస్‌ 9 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌తో సీపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు డకౌటయ్యాడు. జమైకా బౌలర్లలో సల్మాన్‌ ఇర్షాద్‌ 4 వికెట్లతో విజృంభించగా.. మహ్మద్‌ అమిర్‌ 3 వికెట్లతో చెలరేగాడు. ఇమాద్‌ వసీం, నికోల్సన్‌ గోర్డన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తల్లావాస్‌.. బ్రాండన్‌ కింగ్‌, షామారా బ్రూక్స్‌ (28 నాటౌట్‌), కిర్క్‌ మెకెన్జీ (23) రాణించడంతో 16.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో డ్రేక్స్‌, ఒషేన్‌ థామస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్‌ ఎడిషన్‌లో భారత్‌ నుంచి ఒక్క అంబటి రాయుడు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement