కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో తొలి శతకం నమోదైంది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఆటగాడు ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లూయిస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరో ఎండ్‌లో కైల్ మేయర్స్ కూడా శతకానికి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మేయర్స్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.
202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. భానుక రాజపక్స (35 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పేట్రేగిపోవడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో డేవిడ్ వీస్ (20 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు.
పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఎవిన్ లూయిస్ సెంచరీతో చెలరేగినా పేట్రియాట్స్ ఓడిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment