బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మధ్యలో (తొలి టెస్ట్ అనంతరం) భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కాన్‌బెర్రా వేదికగా ఈ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతుంది.
ఈ మ్యాచ్ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (నవంబర్ 22) ప్రకటించింది. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌లో ప్రస్తుత ఆసీస్ జట్టులోని సభ్యుడు స్కాట్ బోలాండ్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌కు ఆసీస్ మాజీ వికెట్‌కీపర్ టిమ్ పైన్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. జాక్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు.
ఈ జట్టు ఆస్ట్రేలియా అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ హీరోలతో నిండి ఉంది. ఈ జట్టులో స్కాట్ బోలాండ్, మ్యాట్ రెన్‌షాలకు జాతీయ జట్టుకు ఆడిన అనుభవం ఉంది. మిగతా ఆటగాళ్లంతా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన మూడేళ్లలో భారత్ పింక్ బాల్ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి.
టీమిండియా విషయానికొస్తే.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు. తాను ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయాన్ని హిట్‌మ్యాన్ బీసీసీఐకి ఇదివరకే తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెగ్యులర్ జట్టు మొత్తం పాల్గొంటుంది. రెండో టెస్ట్ పింక్ బాల్‌తో ఆడే టెస్ట్ కాబట్టి టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా ఉపయెగపడుతుంది.
ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI స్క్వాడ్..
జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బియర్డ్‌మన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఐడాన్ ఓ'కానర్, ఒల్లీ డేవిస్, జేడెన్ గుడ్‌విన్, సామ్ హార్పర్, హన్నో జాకబ్స్, సామ్ కాన్స్టాస్, లాయిడ్ పోప్, మాథ్యూ రెన్‌షా, జెమ్ ర్యాన్.
ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 22) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లు పేట్రేగిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత ఇన్నింగ్స్ 98/6 స్కోర్ వద్ద కొనసాగుతుంది.
భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 26, దేవ్‌దత్ పడిక్కల్ 0, విరాట్ కోహ్లి 5, ధృవ్ జురెల్ 11, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులకు ఔటయ్యారు. రిషబ్ పంత్ (27), నితీశ్ కుమార్ రెడ్డి (15) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment