కెన్యా క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ | Cricket Kenya Appoints Dodda Ganesh As Head Coach | Sakshi
Sakshi News home page

కెన్యా క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌

Published Wed, Aug 14 2024 2:14 PM | Last Updated on Wed, Aug 14 2024 3:04 PM

Cricket Kenya Appoints Dodda Ganesh As Head Coach

కెన్యా పురుషుల క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ దొడ్డ గణేశ్‌ నియమితుడయ్యాడు. కెన్యా క్రికెట్‌ బుధవారం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ టీ20  వరల్డ్‌కప్‌ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ సమీపిస్తున్న తరుణంలో కొత్త కోచ్‌ను నియమించుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దొడ్డ గణేశ్‌ మాట్లాడుతూ.. కెన్యా జట్టును ప్రపంచకప్‌ పోటీలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.

చాంపియన్లు ఉన్నారు
గతంలో ఏం జరిగిందన్న విషయంతో తనకు సంబంధం లేదని.. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని గణేశ్‌ అన్నాడు. కెన్యాలో చాంపియన్లకు కొదవలేదని.. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్‌ 1997లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడేశాడు.

భారత్‌ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్‌ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్‌ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.

ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగా
టీ20 ప్రపంచకప్‌-2026కు అర్హత సాధించే క్రమంలో కెన్యా తొలుత ఆఫ్రికన్‌ దేశాల జట్లతో పోటీపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరుగనున్న ఐసీసీ డివిజన్‌ 2 చాలెంజ్‌ లీగ్‌ సందర్భంగా కెన్యా హెడ్‌కోచ్‌గా దొడ్డ గణేశ్‌ ప్రయాణం మొదలుకానుంది. ఇక అక్టోబరులో తొలుత పపువా న్యూగినియా, ఖతార్‌, డెన్మార్క్‌ జట్లతో ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో తలపడనున్న కెన్యా జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.

గతంలోనూ
కాగా గతంలోనూ భారత క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మనోజ్‌ ప్రభాకర్‌, ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా శ్రీధరన్‌ శ్రీరామ్‌, ఒమన్‌ కోచ్‌గా సునిల్‌ జోషి తదితరులు పనిచేశారు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌గా మరో భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన భారత జట్టును గైడ్‌ చేసిన రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో గంభీర్‌ ఆ పగ్గాలను చేపట్టాడు.

చదవండి: పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement